logo

అమ్మో..కొనలేం..కట్టలేం

ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో రాత్రిపూటా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న ధరలకు వినియోగ దారుల కొనుగోలుకు పొంతన ఉండటం లేదు. ప్రాంతాలను బట్టి ధర నిర్ణయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడం లేదు. బాట ఛార్జీల పేరుతో టన్నుకు

Published : 26 Sep 2022 04:44 IST

ఆగని ఇసుక బాదుడు

చెప్పేది టన్ను రూ.475.. రూ.1200 నుంచి రూ.1300కు విక్రయం

వర్షాకాలం నేపథ్యంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్నాయి. రీచ్‌లు మూతపడటంతో స్టాక్‌ యార్డుల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. నాణ్యత లేని ఇసుకను కూడా టన్ను రూ.1300కు పైబడి కొనుగోలు చేయాల్సి రావడంతో వినియోగదారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

చింతలపూడి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో రాత్రిపూటా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న ధరలకు వినియోగ దారుల కొనుగోలుకు పొంతన ఉండటం లేదు. ప్రాంతాలను బట్టి ధర నిర్ణయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడం లేదు. బాట ఛార్జీల పేరుతో టన్నుకు రూ.100 నుంచి రూ.200 వరకు వినియోగదారులపై భారం పడుతోంది.

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్టాక్‌ పాయింట్లు ఉన్నాయి. పందలపర్రు, పెండ్యాల, తాడేపల్లిగూడెం, కుమారదేవం, సిద్ధాంతంతో పాటు మరో నాలుగు ఉన్నాయి. అన్ని చోట్ల ధరల్లో తేడాలు ఉంటున్నాయి. రీచ్‌ల వద్ద బోట్ల ద్వారా ఇసుక తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ బాట ఛార్జీల పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ భారమంతా వినియోగదారులపై వ్యాపారులు రుద్దాల్సిన పరిస్థితి రావడంతో ధరలు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ, ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలు చేపడుతున్న దాఖలాలు లేవు. కిందిస్థాయి సిబ్బంది.. అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బహిరంగంగా డంప్‌ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
మూడేళ్లుగా ఇసుక విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఆరంభంలో అయితే దొరకని పరిస్థితి. కొందరు అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డాలు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకున్న ఉదంతాలూ ఉన్నాయి. అన్ని రీచ్‌లలో టన్ను రూ.475కే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా గుత్తేదారు సంస్థ అంతకన్నా ఎక్కువకు అమ్ముతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ వే బిల్లులు ఇవ్వకుండా, ముద్రిత బిల్లులు, ఇతర వసూళ్లతో లెక్కలు లేకుండా ఈ తంతు సాగిందన్న విమర్శలు వినిపించాయి.

ట్రాక్టర్‌  రూ.6 వేలు
ఇసుక ధరల భారం భరించలేక ప్రజలు స్థానిక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు వాగులు, కాలువల నుంచి సేకరించి ట్రాక్టర్‌ రూ.6 వేలకు అమ్ముతున్నారు. మూడేళ్ల కిందట రూ.1500 నుంచి రూ.2000 ఉండేది. గోదావరి ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో పాటు బరక, ఒండ్రు కూడా అధికంగా వస్తుండటంతో ప్రజలు ఆ ఇసుకంటేనే భయపడిపోతున్నారు. స్థానికంగా ఎక్కువ ధర ఉన్నా వాగులు, కాలువల ఇసుకే కొనుగోలు చేస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపు అనధికార డంప్‌లు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. కాలువలు, నదులతో పాటు ప్రైవేటు రీచ్‌ల నుంచి తవ్వి తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం మీద రూ.లక్షలు సంపాదిస్తూ కొందరు చక్రం తిప్పుతున్నారు.

శ్లాబు ఆగింది
‘ఇంటికి శ్లాబు వేద్దామంటే ఇసుక లేదు. కొందరు ఎండ్లబండిపై తెచ్చి అమ్ముతున్నారు. అది కూడా రూ.1500 అంటున్నారు. వ్యాపారుల వద్ద కొందామంటే టన్ను రూ.1300 చెబుతున్నారు. అదేమని అడిగితే ర్యాంపుల్లో ఇసుక లభ్యం కావడం లేదంటున్నారు’ అని లింగపాలేనికి చెందిన టి.సురేంద్ర చెప్పారు.
ఇష్టారాజ్యంగా..
ఆకివీడు, న్యూస్‌టుడే: ‘మా ఇంటికి మరమ్మతులు చేయించేందుకు రెండు నెలల కిందట మూడు యూనిట్ల ఇసుక ధర అడిగితే రూ.11 వేలు చెప్పారు. ధర తగ్గుతుందనే భావనతో తెలిసిన వారి వద్ద ఉన్న ఇసుక తీసుకుని మరుగుదొడ్డి పనులు పూర్తిచేయించా. మిగిలిన పనులు చేయడానికి, తీసుకున్న ఇసుకను తిరిగి ఇచ్చేందుకు ఇప్పుడు ధర అడిగితే 3 యూనిట్లు రూ.16 వేలు అంటున్నారు. ’ అని పెదకాపవరానికి చెందిన ఎస్‌.రాము తెలిపారు. 

టన్ను ఇసుక  రూ.1,300
‘ఇంటి శ్లాబు కోసం టన్ను ఇసుకను రూ.1,300 చొప్పున కొనుగోలు చేశా. ఆన్‌లైన్లో బుక్‌ చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది’ అని దెందులూరుకు చెందిన మెన్నెం వెంకటస్వామి తెలిపారు.

ఎక్కువ ధరకు   అమ్మకూడదు
‘రీచ్‌లలో ఇసుక టన్నుకి రూ.475కే అమ్మాలి. అదే స్టాక్‌ యార్డుల నుంచి అయితే ప్రాంతాలను బట్టి ధర మారుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మైనింగ్‌ ఏడీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts