logo

ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ

పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఏడాదిన్నరకుపైగా కావస్తోంది. నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నజరానాలకు అతీగతీ లేదు. పంచాయతీల ప్రథమ పౌరులు ప్రోత్సాహక నిధుల కోసం

Published : 26 Sep 2022 04:44 IST

ఉమ్మడి జిల్లాలో 99 పంచాయతీలు ఏకగ్రీవం

నెలలు అవుతున్నా అతీగతీ లేని నజరానాలు

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరి ఏడాదిన్నరకుపైగా కావస్తోంది. నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నజరానాలకు అతీగతీ లేదు. పంచాయతీల ప్రథమ పౌరులు ప్రోత్సాహక నిధుల కోసం ఆశగా ఎదురుచూసే కొద్దీ వారికి నిరాశే ఎదురవుతోంది.
ఉమ్మడి జిల్లాలో 892 గ్రామపంచాయతీలు, 9,660 వార్డు స్థానాలకు ఎన్నికల ప్రకటన జారీ చేయగా.. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలను మినహాయించగా మొత్తం 793 గ్రామ పంచాయతీలు, 7,030 వార్డు స్థానాలకు సంబంధించి పల్లె పోరు జరిగింది. పంచాయతీలు ఏకగ్రీవమైతే ప్రోత్సాహకం అందిస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఆయా కేటగిరీల వారీగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు సమ్మతించడంతో నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం 99 పంచాయతీలు, 2,630 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు జిల్లాకు సుమారు రూ.6.5 కోట్లు రావాల్సి ఉంది. నెలలు గడిచినా ప్రభుత్వం ప్రకటించిన నజరానాలు అందలేదు. ప్రోత్సాహక నిధులందక.. పంచాయతీల్లో డబ్బులు లేక పాలకులు సమస్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
కుంటుపడుతున్న అభివృద్ధి.. ఏకగ్రీవాల ప్రోత్సాహకాలకు సంబంధించి జిల్లాకు  కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నా నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రోత్సాహక నిధులొస్తే పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రోడ్ల అభివృద్ధి తదితర పనులు చేపడతామని సర్పంచులు చెబుతున్నారు. దీనికితోడు 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో సర్పంచులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
నిధులు రాగానే సర్దుబాటు చేస్తాం.. జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధులు మంజూరుకానున్నాయి. అవి వచ్చిన వెంటనే ఆయా పంచాయతీల ఖాతాల్లోకి సర్దుబాటు చేస్తాం.     - ఎన్‌.బాలాజీ, జిల్లా పంచాయతీ అధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని