logo

గోరుముద్దకూ తిప్పలే!

పెరిగిన ధరలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి వడ్డిస్తున్న గోరుముద్దపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు సమాంతరంగా నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచకపోవడం సమస్యగా మారింది.

Published : 26 Sep 2022 04:44 IST

పెరిగిన ధరలతో నిర్వాహకుల కష్టాలు
మధ్యాహ్న భోజనంపై తీవ్ర ప్రభావం

పాలకొల్లు, పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: పెరిగిన ధరలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వండి వడ్డిస్తున్న గోరుముద్దపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు సమాంతరంగా నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రభుత్వం పెంచకపోవడం సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 75శాతం మంది మధ్యాహ్న భోజనంపై ఆధారపడి ఉన్నారు. వీరందరికీ నిత్యం నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టమవుతోంది.

అయినా తప్పని భారం
ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో రూ.5.40, ఉన్నత పాఠశాలలో రూ.7.85 చొప్పున ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్నారు. 2019లో మెనూ మార్చిన ప్రభుత్వం బిల్లులు పెంపులో మార్పు చేయలేదు.  ఇటీవల కొంత పెంచినా.. మార్కెట్లో వంట నూనెల ధరలు, గ్యాస్‌ ధరలు రెండు రెట్లు పెరిగాయి. అధిక వర్షాలు, వరదల పుణ్యమాని కూరగాయల ధరలు మండుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో బిల్లుల్లో విద్యార్థికి మరో రూపాయి అదనంగా పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించినా ఉత్తర్వులు నేటికీ విడుదల కాలేదు. దీనిపై డీఈవో వెంకటరమణను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా బిల్లులు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయని ఈ నెల నుంచి పెరిగిన ధరలతో నిర్వాహకులకు బిల్లులు విడుదల చేస్తామన్నారు.
* యలమంచిలి నంబర్‌ వన్‌ పాఠశాలలో 135 మంది విద్యార్థులున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు జులై నెలలో ఇక్కడ వంట నిమిత్తం సుమారు రూ.19 వేలు వెచ్చించారు. ఇందుకు వారికి ఆగస్టులో మంజూరైన బిల్లు రూ.13,100. అంటే రూ.6 వేల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని వారెలా భర్తీ చేసుకోవాలంటే సమాధానం లేదు. ఏదో ఒక నెల నష్టం వస్తే సరేగాని ప్రతినెలా వేలల్లో నష్టం అంటే ఎలా భరించాలని నిర్వాహకులు వాపోతున్నారు. వండిన దానిలో ఏదైనా మిగిలితే తాము తినడం తప్ప అంతకు మించి మరేం చేయలేని దయనీయ పరిస్థితి వారిది.
* పెనుగొండ పరిధిలోని ఆర్‌.తోట ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్థులున్నారు. వీరందరికి ఒక్కరే నిత్యం వండి వడ్డిస్తున్నారు. చాలీచాలని బిల్లులతో నెలకు రూ.2 వేలు మాత్రమే జీతం వస్తున్న తరుణంలో కొత్తవారు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని