logo

బాలల మేధస్సుకు పరీక్ష

బాలల మేధస్సుకు పదును పెట్టేందుకు ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక సలహా మండలి (ఆప్కాస్ట్‌), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ‘కౌశల్‌-2022’ పేరిట సైన్స్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

Published : 26 Sep 2022 04:44 IST

ప్రోత్సాహకాలకు ప్రకటన

గోడపత్రాలను విడుదల చేస్తున్న డీఈవో గంగాభవాని తదితరులు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: బాలల మేధస్సుకు పదును పెట్టేందుకు ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంకేతిక సలహా మండలి (ఆప్కాస్ట్‌), భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ‘కౌశల్‌-2022’ పేరిట సైన్స్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను వెలికి తీసి వారికి తగిన ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు పోటీలకు అర్హులు. క్విజ్‌, పోస్టర్‌ ప్రజెంటేషన్లు విభాగాల్లో  పోటీలు నిర్వహిస్తారు.
పేర్ల నమోదు ఇలా: పోటీల్లో పాల్గొనదలిచిన విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా ఉపాధ్యాయుల సాయంతో పాఠశాల నుంచి పేర్లు నమోదు చేసుకోవచ్చు. పేర్ల నమోదుకు అక్టోబరు 15వ తేదీ వరకు గడువు విధించారు.www.bvmap.org వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.

బహుమతులు ఇలా: కౌశల్‌ క్విజ్‌ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.7,500, రూ.6 వేలు, రూ.4,500 నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.9 వేల నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు ఇస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.

పోస్టర్‌ ప్రజెంటేషన్‌ పోటీలకు..: పోస్టర్‌ ప్రజెంటేషన్‌ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచే వారికి రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1,000 చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచే వారికి రూ.7,500, రూ.5 వేలు, రూ.3 వేల చొప్పున ఇస్తారు.

విద్యార్థులకు మంచి అవకాశం
విద్యార్థులు తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం. శాస్త్రసాంకేతిక రంగంలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడం, ఆ రంగంలో ప్రోత్సహించడానికి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటాయి. పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.- ఎస్‌.వెంకటేశ్వరరావు, కౌశల్‌ ఏలూరు జిల్లా సమన్వయకర్త
అర్హత: క్విజ్‌ పోటీలకు బృందం ఎంపిక కోసం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడే విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే జిల్లా స్థాయికి ఎంపికవుతారు. అత్యధిక మార్కుల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో గరిష్ఠంగా 36 బృందాలను ఎంపిక చేస్తారు. గణితం, సైన్స్‌తో పాటు విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల కృషి అనే అంశంపై క్విజ్‌ పోటీలు నిర్వహిస్తారు.
పోస్టర్‌ ప్రజెంటేషన్‌: 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఒక పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకే అవకాశం కల్పిస్తారు. జీవ వైవిధ్య సంరక్షణ, జల సంరక్షణ, వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవాల పోస్టర్‌ ప్రజెంటేషన్‌ పోటీలకు సంబంధించి ప్రతి పాఠశాల నుంచి ఒకటి మాత్రమే అనుమతిస్తారు.
పోటీలు ఎప్పుడంటే: ప్రాథమిక స్థాయి పరీక్షను ఆన్‌లైన్లో నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహిస్తారు. అదే నెల 26న జిల్లా, డిసెంబరు 9న రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని