logo

డిజిటలైజేషన్‌కు శ్రీకారం

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పాత దస్తావేజుల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టింది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి.

Published : 26 Sep 2022 04:44 IST

చురుగ్గా దస్త్రాల స్కానింగ్‌ ప్రక్రియ

చింతలపూడిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

చింతలపూడి, న్యూస్‌టుడే: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ పాత దస్తావేజుల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టింది.ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం 1999 తర్వాత జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యమవుతోంది. అంతకు క్రితం రిజిస్ట్రేషన్‌ వివరాలకు మాన్యువల్‌ రికార్డులే దిక్కు. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న మాన్యువల్‌ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదు.రికార్డులకు చెదలు పట్టడం, పేజీలు చెరిగిపోవటంతో విలువైన సమాచారం చేజారిపోతుంది. దీన్ని అధిగమించడానికి డిజిటలైజేషన్‌ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ప్రజలు కోరే ఏ రిజిస్ట్రేషన్‌ సమాచారమైనా క్షణాల్లో అందించటానికి వీలవుతుంది.

రికార్డుల వివరాలు..
1850 నుంచి 1999 వరకు రిజిస్ట్రేషన్‌ సేవల్ని మాన్యువల్‌గా నిర్వహించేవారు.రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాత రికార్డులు వెతికి మాన్యువల్‌గా రాసి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది చాలా కాలాతీతంతో కూడుకున్నది. ఆపై అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించటం కష్టంగా ఉండేది. బుక్‌-1, బుక్‌-3,బుక్‌-4 , ఇన్‌డెక్స్‌-1, ఇన్‌డెక్స్‌-2 పుస్తకాలు వాల్యూమ్స్‌ రూపంలో ఉన్నాయి. స్థిరాస్తుల విక్రయాలు, వీలునామా, జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ , ఈసీ, నకళ్లు , ఇతర సమాచారం ఈ వాల్యూమ్స్‌లో ఉన్నాయి.

కంప్యూటర్‌ సేవలు అందుబాటులోకి..
* శాఖలో 1999 తర్వాత కంప్యూటీకరణ ప్రారంభమైంది.అప్పటినుంచే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వివరాలను శాఖ అధికారులు పెద్ద వాల్యూమ్‌ పుస్తకంలో చేతితో రాసి భద్రపరిచేవారు. ఆ రికార్డుల్లో ఏదైనా పోతే అందులో ఉన్న ఆస్తుల వివరాలను ధ్రువీకరించుకోవడానికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో అధునాతన స్కానర్లతో డిజిటలైజేషన్‌ చేసి ఆ తర్వాతి సమాచారాన్ని కంప్యూటీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 13సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డిజిటలైజేషన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. జిల్లాలోని భీమడోలుతో పాటు కైకలూరులో ఇప్పటికే డిజిటలైజేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన అన్ని చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు కంప్యూటర్లు, స్కానర్లు ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిద్ధం చేశారు.

రోజూ 2 నుంచి 4 వాల్యూమ్‌లు
నిమిషానికి పది నుంచి 15 పేజీలను స్కాన్‌ చేసే పెద్ద స్కానర్లను ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 3నుంచి 5వరకు ఏర్పాటుచేశారు. దీనికి అనుసంధానంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. సగటున రోజుకు 2 నుంచి 4 వాల్యూమ్స్‌ పూర్తవుతున్నాయి. చింతలపూడి ఆర్‌వోలో 1850 నుంచి 1999 వరకు లెక్కిస్తే ఒక వెయ్యి నాలుగు వాల్యూమ్స్‌ ఉన్నాయి. ఆరు నెలల్లో వీటిని కంప్యూటీకరించనున్నారు. ఆ తర్వాత కొత్త విధానంలో ఈసీలను తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని