logo

శోధించారు.. సాధించారు

అంతర్జాతీయ సదస్సులో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు పలు దేశాల పరిశోధకులతో పోటీపడి అవార్డులు దక్కించుకున్నారు. అనేక అంశాల్లో ప్రదర్శించిన పరిశోధనా పత్రాలకు గుర్తింపు లభించింది.

Published : 26 Sep 2022 04:44 IST

అంతర్జాతీయ వేదికపై ‘ఉద్యాన’ శాస్త్రవేత్తల ప్రతిభ

అవార్డులు అందుకుంటున్న శాస్త్రవేత్తలు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే : అంతర్జాతీయ సదస్సులో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు పలు దేశాల పరిశోధకులతో పోటీపడి అవార్డులు దక్కించుకున్నారు. అనేక అంశాల్లో ప్రదర్శించిన పరిశోధనా పత్రాలకు గుర్తింపు లభించింది. వ్యవసాయం, అటవీ, పర్యావరణ, ఆహార భద్ర]తపై అంతర్జాతీయ సదస్సు 17 నుంచి 19 వరకు నేపాల్‌ దేశంలో    జరిగాయి. వ్యవసాయం అనుబంధ రంగాల్లో నూతన విధానాలు, వాతావరణ మార్పులు అనే అంశాలపై బహుముఖ పరిశోధనలు చేశారు. వాటికి సంబంధించిన పత్రాలను ఈ సదస్సు ముందుంచారు. ఉత్తమ పత్రాలుగా అవి నిలిచాయి.

మేలుజాతి పశు పోషణపై ప్రయోగాలు
పశువైద్య విభాగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నా. పాడి పశువుల్లో అత్యధిక పాల దిగుబడులు ఏ విధంగా సాధించవచ్చో చర్చించాను. ప్రాంతీయంగా ఖనిజ లవణాల మిశ్రమాలను పశువులకు దాణా ఏ విధంగా వేయాలో వివరించా. కృషి విజ్ఞాన కేంద్రంలో పశు వైద్య విభాగంలో భారత పరిశోధనా మండలి తరఫున శాస్త్రవేత్తగా పని చేస్తున్నాను. ఇక్కడ మేలు జాతి పశు పోషణపై చేసిన పరిశోధనలకు ‘మహిళా ఉత్తమ యువ శాస్త్రవేత్త’గా అవార్డు దక్కింది. ఈ స్ఫూర్తితో మరిన్ని అవార్డులు రానున్న రోజుల్లో సాధిస్తాను.  పరిశోధనా స్థాయిలోనే కొన్ని ఉన్నాయి. - డా.టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త  

సేంద్రియ సేద్యంతో అధిక దిగుబడులు
సేంద్రియ విధానంలో ఉద్యాన పంటల సాగు పద్ధతులపై పరిశోధనలు చేశా. వాటిపై  అంతర్జాతీయ సదస్సులో చర్చించాను. వీటిపైనే పరిశోధనా పత్రాలను కూడా అందించా. వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనలు ఉత్తమమైనవిగా గుర్తించి ‘యువ శాస్త్రవేత్త’గా అవార్డు అందుకున్నా. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. -డా.వావిలాల దీప్తి, ఐసీఏఆర్‌ శాస్త్రవేత్త

మిద్దెతోటల పెంపకం.. పోషకాహార భద్రత
గృహావసరాలకు ఇంటిపైనే కూరగాయలను పెంచడం, పట్టణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత వంటి అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రదర్శించాను. ప్రస్తుతం కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్తగా, అధిపతిగా పని చేస్తున్నాను. మరిన్ని అంశాలు పరిశోధనా స్థాయిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చూపుతామన్న ఆత్మవిశ్వాసం ప్రస్తుతం సాధించిన అవార్డులు కల్పించాయి. మిద్దె తోటలను ఏ విధంగా పెంచాలి, వాటి ద్వారా ఒక ఇంటికి సరిపడా కూరగాయలు ఏ విధంగా సమకూర్చుకోవచ్చో వివరించాను. - డా. ఇ.కరుణశ్రీ,   ప్రధాన శాస్త్రవేత్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు