logo

బ్యాంకులకు బురిడీ

జిల్లాలోని తీర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు పర్యటించడంతో మళ్లీ కలకలం మొదలైంది. భూములకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘటనపై విచారణ కోసం సీఐడీ అధికారులు మూడు రోజుల కిందట జిల్లాలో పర్యటించారు.

Published : 27 Sep 2022 06:15 IST

సుమారు రూ.15 కోట్లు దారి మళ్లింపు

రంగంలోకి సీఐడీ

మొగల్తూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని తీర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు పర్యటించడంతో మళ్లీ కలకలం మొదలైంది. భూములకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘటనపై విచారణ కోసం సీఐడీ అధికారులు మూడు రోజుల కిందట జిల్లాలో పర్యటించారు. గతంలోనూ భీమవరం, నరసాపురం పట్టణాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాలకొల్లు పట్టణం, కైకలూరులోని ప్రైవేటు బ్యాంకులో నకిలీ ధ్రువపత్రాలు తాకట్టు పెట్టి రుణం పొందిన ఘటనలు ఉన్నాయి. ఆ సమయంలో సీఐడీ, సీబీఐ అధికారులు విచారణ చేశారు. కొన్ని కేసుల్లో బాధ్యులు దొరకకుండా తప్పించుకున్నారు. కొన్ని కేసుల్లో తీసుకున్న రుణంలో కొంతమేర ఓటీఎస్‌ విధానంలో చెల్లించి బయటపడ్డారు.

29 మంది రైతుల భూములు.. తాజాగా సీఐడీ విచారణతో వెలుగులోకి వచ్చిన కేసులో 29 మందికి చెందిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించినట్లు వెల్లడైంది. మొగల్తూరుకు చెందిన 18 మంది రైతులు, ముత్యాలపల్లి- 8, పేరుపాలెం- 2, కోమటితిప్పకు చెందిన ఒకరైతు భూములను కుదువపెట్టినట్లు తెలిసింది. ఆ భూములకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా రాజమహేంద్రవరం రీజియన్‌ సీఐడీ అధికారులు మొగల్తూరు మండల రెవెన్యూ అధికారులను కోరారు. దీనిపై విచారించిన అధికారులు ఆ భూములకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు అందించే పనిలో నిమగ్నమయ్యారు.

మొత్తం 21 కేసులు.. గణపవరం, భీమవరం కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖల్లో నకిలీ పత్రాలు కుదువపెట్టి సుమారు రూ.15 కోట్ల వరకు రుణాలు పొందినట్లు సీఐడీ అధికారులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం 21 కేసులు నమోదయ్యాయన్నారు. విచారణలో భాగంగా పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు.

భీమవరం కేంద్రంగానే..

తక్కువ విలువగల భూమికి చెందిన అసలు పత్రాలతోపాటు చెరువులు, చేలను లీజుకు తీసుకున్నట్లు సృష్టించిన నకిలీ పత్రాలను కేటుగాళ్లు బ్యాంకుల్లో కుదువపెడుతున్నారు. దీనికి ఆయా బ్యాంకులకు చెందిన మేనేజర్లు, ఫీల్డు ఆఫీసర్లు సహకరిస్తూ రుణాలు మంజూరు చేస్తేస్తున్నారు. తీసుకున్న అప్పు తిరిగి ఆయా బ్యాంకులకు సక్రమంగా చెల్లిస్తే సమస్య ఉండదు. ఎగవేసిన సందర్భంలోనే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. కొన్నేళ్లుగా భీమవరం కేంద్రంగా నకిలీ పత్రాలతో రుణం పొంది ఎగవేసిన కేసులు, నగదు కూడా భారీగానే ఉంటుందని జాతీయ బ్యాంకుల అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని