logo

రా రమ్మంటేనే..ప్రగతి!

పర్యాటకులను రా.. రమ్మని ఆహ్వానించే ప్రకృతి సోయగాలు.. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు.. పాపికొండల నడుమ నుంచి గోదావరి పరవళ్లు..  సంగమ ప్రాంతాన మడ అడవులు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. మన్యంలో

Published : 27 Sep 2022 06:15 IST

అతిథి దేవోభవ అంటే ఆదాయం

నేడు పర్యాటక దినోత్సవం

పాలకొల్లు, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

పర్యాటకులను రా.. రమ్మని ఆహ్వానించే ప్రకృతి సోయగాలు.. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు.. పాపికొండల నడుమ నుంచి గోదావరి పరవళ్లు..  సంగమ ప్రాంతాన మడ అడవులు.. ఆధ్యాత్మిక క్షేత్రాలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. మన్యంలో సెలయేటి గలగలలు.. అన్నింటినీ మించి గోదారోళ్ల మర్యాదలు.. ఉమ్మడి జిల్లాలకు వచ్చేవారిని మంత్రముగ్ధులను చేస్తుంటాయి. కానీ కొవిడ్‌ కారణంగా  గత మూడేళ్లుగా పర్యాటకం చతికిల పడింది.

ఏటా డిసెంబరు నుంచి  ఫిబ్రవరి వరకు గోదావరి జిల్లాలకు పర్యాటకుల తాకిడి  అధికంగా ఉంటుంది. రిసార్టులకు బాగా గిరాకీ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్‌లతో గదులు లభించని పరిస్థితి. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో విపరీతమైన గిరాకీ నెలకొంటుంది. అయితే ఆ దిశగా ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. ఉదాహరణకు పేరుపాలెం బీచ్‌ను తీసుకుంటే ఒక్క కార్తిక మాసంలోనే  2 లక్షల మంది వస్తుంటారు. రిసార్టులు సరిపోక ప్రైవేటు అతిథి గృహాలను  పర్యాటకులు ఆశ్రయిస్తుంటారు.చించినాడ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి.

వసతుల లేమితో ఇబ్బందులు.. గుంటుపల్లి గుహలు చూడాలనే ఆకాంక్ష ఉన్నా   అక్కడ కనీసం తాగునీరు లభించని పరిస్థితి. ఆచంట మండలం పెదమల్లంలో రూ.2 కోట్లతో నిర్మించిన రిసార్టులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం లేక నిరుపయోగంగా ఉంటున్నాయి. 

అడుగులు పడితేనే

మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో గతంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలు అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. భీమవరం పట్టణ పరిధిలో పర్యాటక అభివృద్ధి నిమిత్తం కొన్నేళ్ల కిందట రూ. 25లక్షలు కేటాయించారు. దాదాపు రూ.10 లక్షలతో గునుపూడిలో పంచారామక్షేత్రం పక్కన సమాచార కేంద్రం, వసతిగృహాలను మాత్రం నిర్మించారు.. * పెండింగ్‌లో ఉన్న పెదమల్లం, పేరుపాలెం రిసార్టుల పనులు పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని పర్యాటకాభివృద్ధి అధికారి మెహర్‌హఫీజ్‌ అన్నారు.  కొల్లేరులో టూరిస్టు హబ్‌ ఏర్పాటుకు రూ.8 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు 

సందర్శన ప్రాంతాలు 

పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు, ద్వారకాతిరుమల, ఎర్రకాలువ జలాశయం, గుంటుపల్లిగుహలు, గుబ్బల మంగమ్మ ఆలయం, పారిజాతగిరి, కొల్లేరు సరస్సు, పేరుపాలెం బీచ్, పెదమల్లం రిసార్ట్స్, యలమంచిలిలంక, చించినాడ, నరసాపురం గోదావరి తీర ప్రాంతాలు.

ప్రతిపాదనలు సిద్ధం

పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని పర్యాటకశాఖ జిల్లా మేనేజరు పట్టాభిరామన్న చెప్పారు.పర్యాటకుల కోసం వసతులు సమకూరుస్తామన్నారు. పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ పరిధిలో సమాచార కేంద్రం, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణానికి రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. 

పర్యాటకం ద్వారా ఉమ్మడి జిల్లాల ఆదాయం రూ.3 కోట్లు 

ఏటా వచ్చే పర్యాటకులు 3.5 లక్షలు

ఒక విదేశీ యాత్రికుడు వస్తే రోజుకు వెచ్చించే మొత్తం రూ.1.50 లక్షలు

కొల్లేరులో టూరిజం హబ్‌కు ప్రతిపాదనలు రూ.8 కోట్లు 

పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తే ఏటా ఉపాధి పొందేవారు 20 వేలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని