logo

లిఫ్ట్‌ అడిగి.. మధ్యలో దాడి చేసి!

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటనపై కైకలూరు గ్రామీణ ఠాణాలో ఆలస్యంగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన రామవరానికి చెందిన యాళ్ల వికాస్‌బాబు(23) ఇంటర్‌ వరకు చదివి చేపల

Published : 27 Sep 2022 06:15 IST

చికిత్స పొందుతూ యువకుని మృతి

ఘటనపై అనుమానాలు

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటనపై కైకలూరు గ్రామీణ ఠాణాలో ఆలస్యంగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన రామవరానికి చెందిన యాళ్ల వికాస్‌బాబు(23) ఇంటర్‌ వరకు చదివి చేపల ప్యాకింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 16న రాత్రి 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై చేపల ప్యాకింగ్‌కు పల్లెవాడ నుంచి ఆలపాడు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు. అతనిని వాహనంపై ఎక్కించుకుని వెళ్తుండగా పల్లెవాడ పెట్రోల్‌ బంకు సమీపంలో వెనుక కూర్చున్న వ్యక్తి ముసుగు వేశాడు. అప్పటికే మాటు వేసిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వికాస్‌పై దాడి చేసి తాళ్లతో కట్టి రోడ్డు పక్కనే పడేశారు. అతని ద్విచక్రవాహనంతోపాటు చరవాణిని తీసుకెళ్లిపోయారు. మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్న వ్యక్తి చూసి అతని కట్లు విప్పారు. కుటుంబ సభ్యులకు చరవాణి ద్వారా సమాచారం ఇచ్చారు. బాధితుడిని ఇంటికి తీసుకెళ్లి అతని ఫోన్‌కు రింగ్‌ చేయగా ఆలపాడుకు చెందిన తోట శివకుమార్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌, బట్టలు, ద్విచక్రవాహనం తన ఇంటి సమీపంలో వదిలి వెళ్లారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న వికాస్‌ ఆర్యోగ పరిస్థితి బాగోకపోవడంతో అతని తండ్రి భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చెందాడు. వికాస్‌ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు సోమవారం ఎస్సై చల్లాకృష్ణ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే...

యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి ఘటనపై ఈనెల 17న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో వికాస్‌ ఫిర్యాదు చేశారు. అందుకు కారణమైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు తీసుకొచ్చి నామమాత్రపు విచారణ చేసి పంపించేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడికి పైకి తెలియని బలమైన గాయాలు కావడంతో ఇంటికెళ్లాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకివీడు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం భీమవరం తీసుకెళ్లారు. కొందరు పెద్దల సమక్షంలో కేసును రాజీ చేశారని తెలిసింది. వికాస్‌ చికిత్స పొందుతూ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని