logo

అయ్యో.. దేవుడా.!

చూడచక్కని కుటుంబం.. ముచ్చటగొలిపే చిన్నారులు.. రెక్కలకష్టం విలువ తెలిసినవారు.. హాయిగా సాగిపోతున్న వీరిని చూసి ఆ విధికే కన్నుకుట్టుందేమో.. కారు రూపంలో కుటుంబం మొత్తాన్నే చిదిమేసింది.. నాలుగు నిండు ప్రాణాలను తీసుకెళ్లిపోయింది..

Published : 27 Sep 2022 06:15 IST

కుటుంబాన్ని మింగేసిన కారు ప్రమాదం

న్యూస్‌టుడే, నూజివీడు రూరల్‌

ఉమామహేశ్వరరావు

చూడచక్కని కుటుంబం.. ముచ్చటగొలిపే చిన్నారులు.. రెక్కలకష్టం విలువ తెలిసినవారు.. హాయిగా సాగిపోతున్న వీరిని చూసి ఆ విధికే కన్నుకుట్టుందేమో.. కారు రూపంలో కుటుంబం మొత్తాన్నే చిదిమేసింది.. నాలుగు నిండు ప్రాణాలను తీసుకెళ్లిపోయింది.. అభంశుభం ఎరుగని చిన్నారులపైనా దయచూపలేదు.. గుండెలు పిండేసిన ఈ ఘోర ఘటన ఆదివారం రాత్రి కామవరపుకోట మండలం రావికంపాడులో చోటుచేసుకుంది.. బతుకుదెరువు కోసం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తురకపేట నుంచి ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వలస వచ్చిన నూక గణపతి కుటుంబం రోడ్డు ప్రమాదంలో ఛిన్నాభిన్నమైంది. కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు మృతిచెందారనే గుండెపగిలే వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గణపతి కుమారుడు నూక ఉమామహేశ్వరరావు బాపులపాడు మండలంలోని ఓ దారాల పరిశ్రమలో క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల సొంతిల్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేశారు. ఈనేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకని కుటుంబం మొత్తం విజయవాడలోని కనకదుర్గ, ద్వారకా తిరుమల ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. సోమవారం సొంతూరు శ్రీకాకుళం వెళ్లాల్సి ఉందని ఇప్పుడే గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లిరావాలని తండ్రి చెప్పడంతో ఆయన మాట కాదనలేక మంగమ్మ దర్శనానికి ఆదివారం వెళ్లి తిరిగొస్తుండగా మృత్యువు కారు రూపంలో కబళించింది. అల్లారుముద్దుగా పెరిగిన తనయుడితో పాటు కళ్ల ముందు సందడి చేసే మనుమరాలు షర్మిల, మనుమడు దుర్గాప్రసాద్‌ మృతిచెందారు. విజయవాడలో చికిత్స పొందుతూ ఉమామహేశ్వరరావు భార్య రేవతి కూడా కన్నుమూసింది. జీవిత చరమాంకంలో ఉన్న తమను తీసుకెళ్లకుండా కుటుంబాన్నే లేకుండా చేశావా దేవుడా అంటూ ఆ వృద్ధ దంపతులు విలపించడం చూసి అక్కడివారి హృదయాలను కలిచివేసింది.

రేవతి(తల్లి), దుర్గాప్రసాద్‌, షర్మిల​​​​​​​

చికిత్స పొందుతూ చిన్నారుల తల్లి మృతి

కామవరపుకోట, న్యూస్‌టుడే : కామవరపుకోట మండలం రావికంపాడు వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన షర్మిల, దుర్గాప్రసాద్‌ అనే చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. నూక ఉమామహేశ్వరరావు, అతని భార్య రేవతిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించగా ఆదివారం రాత్రి ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. కళ్లముందే తన భర్తను, పిల్లలిద్దరిని పోగొట్టుకున్న రేవతి సోమవారం రాత్రి విజయవాడ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తడికలపూడి ఎస్సై కె.వెంకన్న తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని