logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమిస్తా.. లక్ష కట్టండి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో ఐటీ కంపెనీ పేరిట ప్రకటనలు గుప్పించిన ఓ 25 ఏళ్ల యువకుడు వందల మందిని నిలువునా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మోసపోయిన నిరుద్యోగులే

Published : 27 Sep 2022 06:15 IST

మాదాపూర్‌లో ఐటీ సంస్థ పేరిట ఓ యువకుడి మోసం

ఈనాడు, హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో ఐటీ కంపెనీ పేరిట ప్రకటనలు గుప్పించిన ఓ 25 ఏళ్ల యువకుడు వందల మందిని నిలువునా ముంచాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మోసపోయిన నిరుద్యోగులే తెలివిగా నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన మాదాపూర్‌ పోలీసులు నిందితుడిని మంగళవారం రిమాండ్‌కు తరలించనున్నారు.

రూ.30 వేల జీతమంటూ ఎర.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రతాప్‌ కట్టమూరి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో డాన్యన్‌ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఏర్పాటు చేశాడు. సంస్థకు తాను బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌నని ప్రచారం చేసుకున్నాడు. నియామకాలు చేపడుతున్నామని.. ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌ జాబ్స్‌ పేజీలో పోస్టు చేశాడు. నమ్మిన సుమారు 200 మంది నిరుద్యోగులు అతడిని సంప్రదించారు. ఉద్యోగం కావాలంటే మూడు నెలల శిక్షణ తీసుకోవాలని.. తర్వాత ప్లేస్‌మెంట్‌ ఉంటుందని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష- లక్షన్నర వరకూ వసూలు చేశాడు. శిక్షణ కాలంలో నెలకు రూ.20 వేల చొప్పున భృతి.. ఉద్యోగం వచ్చాక రూ.30 వేల జీతం ఇస్తానని చెప్పాడు. కొందరు ఆన్‌లైన్లో, మరికొందరు కార్యాలయానికి వెళ్లి డబ్బు కట్టారు. వారందరికీ వారానికి రెండు, మూడు రోజులు గూగుల్‌ మీట్‌లో తరగతులు నిర్వహించేవాడు. శిక్షణ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. భృతి, ఉద్యోగం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన కొందరు ప్రతాప్‌ను అడిగినా సరిగా స్పందించలేదు. గట్టిగా నిలదీసిన కొందరికి రూ.6 వేల చొప్పున చెల్లించి మిన్నకుండిపోయాడు. విసిగిపోయిన బాధితులు ప్రతాప్‌ను పట్టుకునేందుకు ప్రణాళిక వేశారు. ఉద్యోగం కావాలంటూ ఓ యువతితో ఫోన్‌ చేయించారు. డబ్బులిస్తామని చెప్పడంతో తీసుకునేందుకు వచ్చి నిందితుడు దొరికిపోయాడు. ప్రతాప్‌ గతంలో విశాఖలోనూ ఉద్యోగాలిస్తామంటూ కొందరిని మోసం చేసినట్లు బాధితులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని