logo

నిబంధనలు గాలికి..

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి చేపలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ప్రసుత్తం ఇతర రాష్ట్రాలు కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పోటీ ఎదురవుతోంది. పేరుకు డెల్టా ప్రాంతమైనా కీలక సమయంలో నీటి లభ్యత లేకపోవడం, కలుషిత నీటితో ఆ పోటీని తట్టుకోవడంలో మన ఆక్వా రైతులు చతికిలపడుతున్నారు.

Published : 02 Oct 2022 03:00 IST

చేపల సాగుకు కలుషిత నీటి బెడద

దిగుబడిపై ప్రతికూల ప్రభావం

మోటూరు ఛానల్‌లోకి వదులుతున్న ఉప్పునీరు

మండవల్లి, న్యూస్‌టుడే: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడి చేపలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ప్రసుత్తం ఇతర రాష్ట్రాలు కూడా ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పోటీ ఎదురవుతోంది. పేరుకు డెల్టా ప్రాంతమైనా కీలక సమయంలో నీటి లభ్యత లేకపోవడం, కలుషిత నీటితో ఆ పోటీని తట్టుకోవడంలో మన ఆక్వా రైతులు చతికిలపడుతున్నారు.

ఏలూరు జిల్లా పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఏటా 8 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధానంగా మంచినీటి లభ్యతపైనే చేపల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఆరు నెలలకోసారి సమృద్ధిగా మంచినీరు లభిస్తేనే చేపల్లో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బెడద తగ్గుతుంది. ఫలితంగా పెట్టుబడుల భారం తగ్గి రైతులు మంచి లాభాలు సాధించేందుకు వీలుంటుంది. అయితే చెరువుల నిర్వహణలో నిబంధనలు పాటించక పోవడంతో కాలువల్లోని నీరు కలుషితమవుతున్నాయి. తిరిగి ఆ నీటినే చెరువుల్లో నింపుతుండటంతో దిగుబడి పడిపోయి నష్టాలు తప్పడం లేదు.

స్వయంకృత అపరాధమే.. నిబంధనల ప్రకారం ఆక్వా చెరువు తవ్వాలంటే తప్పక డ్రెయినేజీ సౌకర్యం ఉండాలి. ఉమ్మడి జిల్లాలోని 90 శాతం చెరువులకు ఈ సౌకర్యం లేకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారు. చెరువుల్లో కలుషితమైన మురుగునీటిని నేరుగా మంచినీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో నీలి ఆకు, పచ్చశైవలం వంటివి పెరిగి నీరు కలుషితమవుతోంది. మరోవైపు వనామీ రొయ్యల సాగులో వినియోగించిన ఉప్పునీటిని నేరుగా కాలువల్లోకి విడుదల చేస్తున్నారు.

చైతన్యం అవసరం.. ఒకప్పుడు దేశానికే తలమానికంగా ఆంధ్రప్రదేశ్‌ చేపల రంగం ఉండేది. ఇక్కడి నుంచి 16 రాష్ట్రాలకు కేవలం మన చేపలనే ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం తెలంగాణ, ఒడిశా, పశ్చిమబంగ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చేపలసాగు దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ పోటీని ఎదుర్కోవాలంటే నాణ్యమైన నీటి వనరులే ఆధారం.

చేపల సాగుకు నీటిని ఇవ్వాలి

సాగునీటితోపాటు చేపల చెరువులకు సైతం నీటిని విడుదల చేయాలి. మంచినీటి కాలువల్లోకి ఉప్పునీటిని విడుదల చేస్తున్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. మోటూరు, గుడివాడ ఛానళ్లు వర్షకాలంలో సైతం ఉప్పునీటితోనే ఉంటున్నాయి. - సీహెచ్‌. శ్రీమన్నారాయణ, చేపల రైతు, భైరవపట్నం

కేసులు పెడుతున్నాం

పంటకాలువల్లో ఉప్పునీటిని విడుదల చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నాం. అన్ని గ్రామాల్లో మంచినీటి వనరులను కలుషితం చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఉప్పునీటి వల్ల చేపల పెరుగుదల నిలిచిపోయి, వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. - ప్రతిభ, ఏడీఏ మత్స్యశాఖ, కైకలూరు

ఉమ్మడి జిల్లాలో చేపల సాగు ఇలా..

ఏలూరు లక్ష ఎకరాలు

పశ్చిమగోదావరి 30 వేల ఎకరాలు

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts