logo

అడ్డగోలుగా రుణాలు

సహకార సంఘాల అభ్యున్నతికి పాటుపడాల్సిన కొందరు సిబ్బంది అక్రమార్జనే ధ్యేయంగా వాటిని నష్టాలపాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో రుణాలు తీసుకొని స్వాహా చేస్తున్నారు. చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటు చేసుకున్న కుంభకోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Updated : 02 Oct 2022 06:25 IST

కుటుంబ సభ్యులు, బినామీలకు రూ.14.17 కోట్లు?

చింతలపూడి సహకార సంఘంలో అక్రమాలు

నిఘా విభాగం

చింతలపూడి సొసైటీ కార్యాలయం

సహకార సంఘాల అభ్యున్నతికి పాటుపడాల్సిన కొందరు సిబ్బంది అక్రమార్జనే ధ్యేయంగా వాటిని నష్టాలపాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో రుణాలు తీసుకొని స్వాహా చేస్తున్నారు. చింతలపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చోటు చేసుకున్న కుంభకోణం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

చింతలపూడి సంఘంలో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు సొసైటీ రికార్డుల పరిశీలనకు ఆడిటర్లను నియమించారు. వారు రంగంలోకి దిగి పరిశీలన చేపట్టి కొన్ని ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగాన్ని గమనించారు. మొత్తం 42 మందికి రూ.14.17 కోట్ల రుణాలను బాండ్లు లేకుండా ఇచ్చినట్లు నివేదించారు. అవన్నీ బినామీ రుణాలేనని, రుణ బాండ్లు లేకుండా రూ.10 కోట్లు సొంత నిధి రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే 2,275 గడువు దాటిన రుణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఎత్తిచూపారు. ఈ లోపాలకు సొసైటీ సీఈవో బాధ్యత వహించాలని సిఫార్సు చేశారు. ఏపీసీఎస్‌ చట్టం 1964లోని సెక్షన్‌ 51 ప్రకారం చట్టబద్ధమైన విచారణకు ఆదేశించాలని సూచిస్తూ జిల్లా సహకార అధికారికి నివేదిక సమర్పించారు.

అధికారుల చోద్యం.. జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా సహకార ఆడిటర్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు వెళ్లి దస్త్రాల నిర్వహణ, రుణాల మంజూరు, చెల్లింపులు తదితర విషయాలపై తనిఖీలు చేపట్టాలి. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఫలితంగా రుణాలు తీసుకున్న రైతులు చెల్లించిన కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి.

ఇదీ లెక్క.. సహకార సంఘంలో కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీ రైతులకు రుణాలు ఇచ్చి సుమారు రూ.14.17 కోట్లు కట్టబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ సంఘంలో పని చేస్తున్న కీలక అధికారి కుటుంబ సభ్యుల్లోని ఒక వ్యక్తికి రూ.1.14 కోట్లు, మరొకరికి రూ.1.68 కోట్లు వివిధ రుణాల పేరిట రుణాలిచ్చారు. మరొకరికి రూ.50.29 లక్షలు, ఇంకొకరికి రూ.78.91 లక్షలు, వేరొకరికి రూ.71.64 లక్షలు ఇచ్చారు.●

* సొసైటీలో ఓ మహిళా రైతు ఐదు ఎకరాల 76 సెంట్ల భూమిని హామీగా పెట్టి మొత్తం రూ.13 లక్షల వివిధ రకాల రుణాలు తీసుకున్నారు. కానీ ఆమెకు రూ.25 లక్షలు సొంత నిధుల నుంచి (ఓన్‌ ఫండ్‌) రుణం ఇచ్చినట్లు నోటీసు జారీ చేశారు. తాము (ఓన్‌ ఫండ్‌) రుణం తీసుకోలేదని, దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని విచారణకు వచ్చిన ఆడిట్‌ అధికారులకు ఆమె రాసిచ్చారు. ఇలా రుణాలిచ్చి నిధులు దుర్వినియోగం చేశారు.●

* గతంలో ఓ అధికారి సూపర్‌వైజర్‌గా పనిచేసిన సమయంలో అనేక అవకతవకలు జరగగా.. ప్రస్తుతం ఆయనకే ఇక్కడ కీలక పదవిని అప్పగించారు. తాజాగా ఆయన కుటుంబంలోని ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా రూ.8 లక్షల రుణం ఇచ్చారు. ఇలా కోట్ల రూపాయలను బినామీల పేరుతో పక్కదారి పట్టించారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలకు, హామీ బాండ్లకు పొంతన లేకపోవడం గమనార్హం. ఇంకా లోతుగా విచారణ చేస్తే మరో రూ.15 కోట్ల అవకతవకలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది

సొసైటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏలూరు జిల్లా సహకార అధికారిణి ప్రవీణను వివరణ కోరగా ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోందన్నారు. ఆడిటర్ల బృందం ఇచ్చిన నివేదికను పూర్తి సాక్ష్యాలతో పాటు వివరణాత్మకంగా మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించామన్నారు. ఆ నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts