logo

జననాల నమోదులో నిర్లక్ష్యం

పుట్టిన ప్రతి పసిబిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కీలకం. అంగన్‌వాడీ సేవల నుంచి ఆధార్‌ నమోదు వరకు అన్నింటికీ అదే ఆధారం. అయితే ఆ పుట్టిన రోజును నమోదు చేయడంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

Published : 02 Oct 2022 03:00 IST

పత్రాల కోసం తల్లిదండ్రులకు అవస్థలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: పుట్టిన ప్రతి పసిబిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కీలకం. అంగన్‌వాడీ సేవల నుంచి ఆధార్‌ నమోదు వరకు అన్నింటికీ అదే ఆధారం. అయితే ఆ పుట్టిన రోజును నమోదు చేయడంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా జనన ధ్రువీకరణ పత్రం జారీ కాకపోవడం.. ఆధార్‌ లేనందున తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు జంగారెడ్డిగూడెంలో ఎక్కువమంది ఉన్నారు. ఆసుపత్రుల వారు వివరాలను ఆన్‌లైన్‌ చేయలేదన్న విషయం తెలియక పురపాలక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సాధారణంగా పుట్టిన 21 రోజుల్లోపు నమోదు చేయాలి. ఏడాదిలోపు నోటరీ ద్వారా అవకాశం ఉంది. దాటితే పురపాలక కార్యాలయంలో నమోదు కాలేదన్న పత్రం తీసుకోవాలి. అనంతరం తహశీల్దారు, ఆర్డీవో విచారించి ధ్రువీకరించాకే నమోదుకు అవకాశం ఉంటుంది.

చాలా రోజుల నుంచి తిరుగుతున్నా

‘2020 మే 23న నాకు బాబు సాత్విక్‌ పుట్టాడు. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స చేశారు. జనన వివరాలు పురపాలక కార్యాలయంలో నమోదు కాలేదు. అప్పటి నుంచి ఆసుపత్రి, పురపాలక కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఆసుపత్రిలో ప్రసవం జరిగితే ఇంటి దగ్గర ప్రసవించినట్లు ధ్రువపత్రం తీసుకోమని అక్కడివారు సలహా ఇస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే ఆసుపత్రిలో పాప పుట్టింది. ఆమెకు జనన ధ్రువీకరణ వచ్చింది. ఆధార్‌ రాక ఇబ్బందులు పడుతున్నాం’ అని సీహెచ్‌పోతేపల్లికి చెందిన గౌతమి తెలిపారు.


మనవరాలికి ఆధార్‌ రాలేదు

‘మా అమ్మాయి కొండా అనూష జనవరి 11న ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించింది. ధ్రువపత్రం కోసం పురపాలక కార్యాలయానికి వెళ్తే ఆన్‌లైన్‌ కాలేదన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు తిరిగినా ఫలితం లేదు. ఆసుపత్రి వారు మా అమ్మాయి ప్రసవమైనట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తప్పు ఎవరిదో తెలియడం లేదు. ఈ కారణంగా మా మనవరాలికి ఆధార్‌ రాలేదు’ అని మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన కలిబోయిన శ్రీను, నాగలక్ష్మి తెలిపారు.


ఎవరిని అడగాలో తెలియడం లేదు

‘పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాకు 2020 మార్చి 15న బాబు పుట్టాడు. మా అబ్బాయి పేరు నమోదు కాలేదని చెబుతున్నారు. ఫలితంగా ఆధార్‌ రాక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరిని అడగాలో ఏమి చేయాలో తెలియడం లేదు’ అని రావికంపాడుకు చెందిన చింతా కల్యాణి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని