logo

బాపూ..దారి చూపు

దేశ ప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెలు పచ్చగా.. స్వచ్ఛంగా ఉండాలనే పూజ్య బాపూజీ ఆశయాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను 2014 అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నాటి నుంచి పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పులేదు.

Published : 02 Oct 2022 03:00 IST

సమష్టి కృషితోనే స్వచ్ఛ సాధన 

నేడు గాంధీ జయంతి

ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలు కావాలి.

పారిశుద్ధ్యం విషయంలో ప్రతి వ్యక్తి తనకు తాను పారిశుద్ధ్య కార్మికుడిగా వ్యవహరించాలి. - మహాత్మాగాంధీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: దేశ ప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెలు పచ్చగా.. స్వచ్ఛంగా ఉండాలనే పూజ్య బాపూజీ ఆశయాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను 2014 అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. నాటి నుంచి పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పులేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇప్పటికీ రోడ్ల వెంబడి చెత్తకుప్పలు దర్శనమిస్తూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు, పర్యవేక్షణ లేమే దీనికి ప్రధాన కారణం. 

లోపాలు ఇవీ..

ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా పారిశుద్ధ్య లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అపరిశుభ్రత కారణంగా ప్రబలుతున్న వ్యాధులతో వేలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇళ్ల నుంచి చెత్తను తడి, పొడిగా సేకరించే ప్రక్రియ సజావుగా సాగడం లేదు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసి విక్రయించేలా నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా పన్ను విధిస్తున్నా పరిస్థితుల్లో మార్పురావడం లేదంటూ పలు పట్టణాల్లో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ  కాస్త మెరుగు 

విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డులకు తరలిస్తారు. అక్కడ తడి, పొడిగా వేరుచేస్తారు. కాగితాలు, అట్టలు, ఇతరత్రా పొడి చెత్తను విక్రయిస్తున్నారు. తడిచెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కరిగించి పలు అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చర్యల సత్ఫలితాలు ఇస్తుండటంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకుల్లో నిలుస్తున్నాయి.

ఇదీ మన ప్రస్థానం 

లక్ష జనాభా దాటిన పట్టణాల్లో స్వచ్ఛసర్వేక్షణ్‌-17 కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 400 పట్టణాలను పరిశీలించగా ఏలూరు- 86, భీమవరం- 87, తాడేపల్లిగూడెం- 97 ర్యాంకులు సాధించాయి. 2018లో జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులను ఉమ్మడి జిల్లాలోని పలు పట్టణాలు దక్కించుకున్నాయి. 2019, 2020 సంవత్సరాల్లో పలు పట్టణాలు 200 పైబడిన ర్యాంకుల్లో నిలిచి పలు విభాగాల్లో బహుమతులు దక్కించుకున్నాయి.

చైతన్యం.. సమన్వయమే మార్గం 

ప్రజా చైతన్యం.. క్షేత్రస్థాయి సిబ్బంది, వివిధ అధికారుల సమన్వయంతోనే నూరు శాతం స్వచ్ఛత సాధ్యమని ఉన్నతాధికారులు తరచూ నిర్వహించే సమీక్షల్లో చెబుతున్నా ఆ దిశగా కార్యాచరణ అమలు కావడం లేదు.  స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు గతంలో చేపట్టినా అవన్నీ మొక్కుబడి తంతుగా మారిపోయాయి. దీనిలో యువజన, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. పట్టణాలు, గ్రామాల్లో కాలనీలకు చెందిన అసోసియేషన్లు కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు.

డంపింగ్‌ యార్డుల్లేక..

చెత్తను తరలించేందుకు 146 వాహనాలు పాతవి ఉన్నాయి. క్లాప్‌-100లో జిల్లాకు మరో 226 వాహనాలు వచ్చాయి. మెప్మా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్లాస్టిక్‌ డబ్బాలు పంపిణీ చేశారు. నిత్యం దాదాపు 480 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీన్ని వేసేందుకు తగిన డంపింగ్‌ యార్డులు లేవు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేస్తామని చెప్పినా ఆ ప్రక్రియ పట్టాలెక్కడం లేదు. మరోపక్క పట్టణాల్లో వ్యర్థాల బదిలీ కేంద్రాల నిర్మాణాలకు స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం ప్రధాన సమస్యగా మారింది.

నిర్మించి.. వదిలేసి

భీమవరం మండలం కొవ్వాడలో కొన్నేళ్ల కిందట సుమారు రూ.6 లక్షలతో నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఇది. ఇప్పటి వరకూ దీన్ని వినియోగంలోకి తేలేదు. ఈ కేంద్రంలోని నిర్మాణాలు శిథిలస్థితికి చేరుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్యమూ అధ్వానంగా తయారైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 శాతం గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. - న్యూస్‌టుడే, భీమవరం గ్రామీణ

స్థల సేకరణ వేగవంతం

క్లాప్‌-100లో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ జరుగుతోంది. గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు ఏర్పాటుచేసి చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. పట్టణాలకు సంబంధించి డంపింగ్‌ యార్డుల కోసం స్థల సేకరణను వేగవంతం చేశాం. - ఎన్‌వీవీ సత్యనారాయణ, పురపాలక ఆర్డీ 

లెక్కల్లో ఇలా (ఉమ్మడి జిల్లాలో)

చెత్త ఉత్పత్తి రోజుకు - 1240 టన్నులు (సుమారు)

వాహనాల నిర్వహణ వ్యయం నెలకు రూ.2.20 కోట్లు

వేతనాలు, ఇతరత్రా వ్యయాలు నెలకు రూ. 3.20 కోట్లు 

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts