logo

అడుగడుగునా అవరోధాలు

ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థకు వివిధ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండాడ, మొగదిండి, రుద్రాయకోడు, చినకాపవరం, యండగండి తదితర ప్రధాన డ్రెయిన్ల గట్లు వివిధ చోట్ల జారిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి.

Published : 02 Oct 2022 03:00 IST

ఎగువ నుంచి కొట్టుకొస్తున్న తూడు, గుర్రపుడెక్క

వంతెనలకు దిగువున మేట వేస్తున్న వ్యర్థాలు

ఉండి, న్యూస్‌టుడే

ఉండి - ఆకివీడుల మధ్య 165వ జాతీయ రహదారిపై అజ్జమూరు వంతెన ఇది. దీని దిగువున మట్టి, చెత్తాచెదారం చాలాకాలం నుంచి పేరుకుపోయింది. దీంతో ఎగువనున్న ఉండి మండలంలోని కవిటంపాకలు, అర్తమూరు, ఆకివీడు మండలంలోని అజ్జమూరు తదితర ప్రాంతాల్లో వరి, ఆక్వా చెరువుల్లోని మురుగునీరు సకాలంలో ముందుకెళ్లడం లేదని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.

ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థకు వివిధ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొండాడ, మొగదిండి, రుద్రాయకోడు, చినకాపవరం, యండగండి తదితర ప్రధాన డ్రెయిన్ల గట్లు వివిధ చోట్ల జారిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. మురుగు ముందుకెళ్లని పరిస్థితి. బొండాడ, రుద్రాయకోడు, చినకాపవరం, మొగదిండి తదితర డ్రెయిన్ల పరిధిలో పెరిగిపోతున్న ఆక్రమణలే ఇందుకు కారణం. ప్రధానంగా మూడు మీటర్లు వదిలిన తర్వాతే ఆక్వా చెరువులు తవ్వుకోవాలనే నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. ఆయా డ్రెయిన్ల వెంబడి కనీసం కాలిబాట మార్గాలు కూడా కరవైపోతున్నాయి. పూడికతీత పనులు చేపట్టాలంటే కనీసం పొక్లెయిన్‌ కూడా డ్రెయిన్‌ గట్లపై ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సకాలంలో గుత్తేదారులు ముందుకు రాక.. రుద్రాయకోడు, చినకాపవరం, మొగదిండి వంటి డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులకు గుత్తేదారులు సకాలంలో ముందుకురాని పరిస్థితి ఈ ఏడాది ఎదురైంది. దీంతో ఖరీఫ్‌ నారుమడి దశలోనే ఆయా డ్రెయిన్ల పరిధిలోని వరి రైతులు అధికవర్షాల సమయాల్లో ముంపు సమస్యను చవిచూశారు. డ్రెయిన్ల అధ్వానపరిస్థితిపై ‘ఈనాడు’లో జులై, ఆగస్టు నెలల్లో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి గుత్తేదారులను ఒప్పించి తూడు తొలగింపు పనులు చేపట్టారు. పైన తీస్తున్న గుర్రపుడెక్కను వివిధ చోట్ల కిందకు నెట్టేస్తుండటంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.

అన్ని చోట్లా తూడు తొలగింపు పనులు

మురుగునీటి పారుదలకు అవరోధాలు ఎదురవకుండా తూడు తొలగింపు పనులు చేపట్టాం. వంతెనలు, కల్వర్టు వద్ద చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పూడికతీత పనుల ప్రతిపాదనలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. - టి.అప్పారావు, డీఈఈ, డ్రైనేజీ శాఖ, ఆకివీడు.

ఈ చిత్రం ఉండి మండలంలోని వాండ్రం కాజ్‌వే ప్రాంతంలోనిది. బొండాడ మేజర్‌ డ్రెయిన్‌లో మురుగునీటి పారుదలకు ఇక్కడ తూడు, గుర్రపుడెక్కలు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి. అధిక వర్షాలు కురిసిన సమయాల్లో పల్లపు ప్రాంతాల్లోని వరి చేల్లో మురుగు ముందుకెళ్లక రైతులు ఇబ్బందులు చవిచూస్తున్నారు.

అజ్జమూరు వంతెన వద్ద మురుగునీటిని అడ్డుకుంటున్న మట్టి గుట్టలివి. ఉండి ప్రధాన పంట కాలువలకు టైలాండ్‌గా ఉన్న రుద్రాయకోడులోని నీరంతా ఇక్కడి నుంచే ఆకివీడు, కాళ్ల మండలాల మీదుగా ఉప్పుటేరులోకి చేరాల్సి ఉంది. మట్టిగుట్టల కారణంగా అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని