logo

హౌసింగ్‌ అక్రమాల్లో కీలక నిందితుల అరెస్టు

సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశాక వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థలో అక్రమాలకు పాల్పడిన కీలక నిందితులను అరెస్టు చేశారు.

Published : 02 Oct 2022 03:00 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: సీఐడీ పోలీసులు రంగప్రవేశం చేశాక వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థలో అక్రమాలకు పాల్పడిన కీలక నిందితులను అరెస్టు చేశారు. సంస్థ సీఈవో విశాఖకు చెందిన చవ్వాకుల రాజప్రకాశ్‌, రాజమహేంద్రవరం బ్రాంచ్‌ సీఈవో సత్యప్రసాద్‌, ల్యాండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఈడీ రాజమహేంద్రవరానికి చెందిన ఉడతా గౌతమ బుద్ధుడు, గుంటూరు బ్రాంచ్‌ సీఈవో హనుమంతరావు, రాయలసీమ సీఈవో నెల్లూరు నరసారెడ్డితోపాటు ఏలూరు బ్రాంచికి చెందిన షేక్‌ సుభానీలను రాజమహేంద్రవరం సీఐడీ డీఎస్పీ పులి విజయ్‌కుమార్‌ మూడు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరిని ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. వీరందరినీ జిల్లా జైలుకు తరలించారు.

ఏలూరులో 30 మంది వినియోగదారులకు సరిపోయే స్థలాన్ని 250 మందికి రిజిస్ట్రేషన్లు చేయడం, నగర శివారులోని మరో ప్రాంతంలో 60 మందికి కేటాయించాల్సిన స్థలాలను 650 మందికి రిజిస్ట్రేషన్లు చేయడం వంటి అక్రమాలకు సంస్థ పాల్పడినట్లు విచారణలో తేలింది. తొలుత 2016లో ఏలూరు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో వీవీఆర్‌ హౌసింగ్‌ సంస్థపై 5 కేసులు నమోదు చేశారు. ఏలూరులోనే 500 మంది బాధితులున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సంస్థ సీఎండీ వాసుదేవరావును, ఎండీ సూర్యప్రభ సహా మరో నలుగురిని అప్పటి త్రీటౌన్‌ సీఐ అరెస్టు చేశారు. బాధితులు ఎక్కువ మంది ఉన్నందున ఈ కేసును 2020లో ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సీఐడీ పోలీసులు మనీ ల్యాండరింగ్‌ కింద కేసులు నమోదుచేశారు. కంపెనీ ఆస్తులను సీజ్‌ చేశారు. మొత్తం రూ.16 కోట్ల కుంభకోణం జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇన్వెస్టిగేషన్‌ అధికారి సీఐడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంస్థలో ఇంకా అక్రమాలకు పాల్పడినవారు ఉన్నారని గుర్తించి వివిధ జిల్లాల్లో సీఈవోలుగా ఉన్న పలువురిని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో 20 మంది అరెస్టు కావాల్సి ఉన్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు