logo

బుజ్జాయిలకు గుర్తుండిపోయేలా!

చిన్నారులను ఆకట్టుకునేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ ఆటవస్తువులు, రంగురంగుల బొమ్మలతో పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పాటు చిన్నారుల వికాసానికి దోహదపడేలా వీడియో పాఠాలతో ఇళ్ల వద్ద పునశ్చరణ జరిగేలా కొత్త విధానాన్ని తాజాగా ప్రారంభించారు.

Published : 05 Oct 2022 06:00 IST

వీడియో పాఠాలతో పునశ్చరణ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: చిన్నారులను ఆకట్టుకునేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ ఆటవస్తువులు, రంగురంగుల బొమ్మలతో పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పాటు చిన్నారుల వికాసానికి దోహదపడేలా వీడియో పాఠాలతో ఇళ్ల వద్ద పునశ్చరణ జరిగేలా కొత్త విధానాన్ని తాజాగా ప్రారంభించారు. చిన్నారుల తల్లులకు వాట్సాప్‌ ద్వారా నిత్యం ఒక కొత్త అంశాన్ని వీడియో రూపంలో పంపి ఖాళీ సమయాల్లో వాటిని పిల్లలకు నేర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు.
ఇలా అమలు.. పోషకాహారం, శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేసే అంశాలపై వీడియోల ద్వారా చిన్నారులకు అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో షెడ్యూలు ప్రకారం బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలను ముందుగానే తల్లుల చరవాణులకు వాట్సాప్‌ పంపిస్తారు. 3, 4 ఏళ్లలోపు పిల్లలకు పి.పి-1, నాలుగేళ్లు పైబడిన వారికి పి.పి-2 పాఠ్యాంశాలను వాట్సాప్‌ గ్రూపుల్లో పంపిస్తారు. అక్షరాస్యులైన తల్లులు వీటిని పరిశీలించి చిన్నారులకు ఇంట్లో మరోసారి వివరించాల్సి ఉంటుంది. దీంతో పాటు చిత్రాలకు రంగులు వేయిస్తారు. ఒత్తిడి లేకుండా విద్యను అందించాలనే లక్ష్యంతో బోధనలో పలు మార్పులు తీసుకొచ్చి తల్లులను కూడా భాగస్వాములను చేస్తున్నామని శిశు, సంక్షేమ, సాధికారిత జిల్లా అధికారిణి బి.సుజాతరాణి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని