logo

పాదయాత్రకు రోజుకు ఎంతిస్తున్నారు?: అర్చకుడి వ్యాఖ్యలతో రాజధాని రైతుల మనస్తాపం

పాదయాత్రలో పాల్గొంటే మీకు రోజుకు రూ.200 ఇస్తున్నారా, రూ.300 ఇస్తున్నారా అంటూ అర్చకుడు వ్యాఖ్యలు చేయడం బాధగా, అవమానకరంగా ఉందని రాజధాని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 11 Oct 2022 12:32 IST

ఆచంట, న్యూస్‌టుడే: పాదయాత్రలో పాల్గొంటే మీకు రోజుకు రూ.200 ఇస్తున్నారా, రూ.300 ఇస్తున్నారా అంటూ అర్చకుడు వ్యాఖ్యలు చేయడం బాధగా, అవమానకరంగా ఉందని రాజధాని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహా పాదయాత్రలో భాగంగా రాజధాని రైతులు ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని లక్ష్మీజనార్దనస్వామి కల్యాణ మండపంలో బస చేశారు. పాదయాత్రకు సోమవారం విరామం కావడంతో పలువురు మహిళా రైతులు ఉదయమే.. పక్కనే ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

అమ్మవారి దర్శనం అనంతరం అర్చకుడు ఉప్పల రమణ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారంటూ మహిళా రైతులు పాపినేని రాజేశ్వరి, తుమ్మల లక్ష్మీజ్యోతి, బత్తుల లీలావతి ఆందోళనకు దిగారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ధారపోస్తే కూలి తీసుకుని పాదయాత్ర చేసేవారిలా కనిపిస్తున్నామా అంటూ అర్చకుణ్ని నిలదీశారు. వాగ్వాదం పెరుగుతుండటంతో తోటి అర్చకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. వ్యాఖ్యలు చేసిన అర్చకుడు కూడా ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయారు.

అనంతరం మహిళా రైతులు అతడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి వస్తే అవమానపర్చడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని మండిపడ్డారు. ఈ వివాదంపై ఆలయ ఈవో శ్రీనివాసరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా అర్చకుణ్ని పిలిపించి మాట్లాడామని, అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులను గౌరవప్రదంగా చూస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని