logo

Super Star Krishna: పశ్చిమలోనే ప్రధమ సింహాసనం

అది జరిగిన కథ.. మరపురాని కథ. చూడటానికి చుట్టాలబ్బాయ్‌లా ఉండే ఘట్టమనేని శివరామకృష్ణ(సూపర్‌స్టార్‌ కృష్ణ) తన జైత్రయాత్రలో పలు కీలక ఘట్టాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచే అప్పట్లో శంఖారావం పూరించారు.

Updated : 16 Nov 2022 09:30 IST

సూపర్‌స్టార్‌కు ఉమ్మడి జిల్లాతో విడదీయలేని బంధం

అది జరిగిన కథ.. మరపురాని కథ. చూడటానికి చుట్టాలబ్బాయ్‌లా ఉండే ఘట్టమనేని శివరామకృష్ణ(సూపర్‌స్టార్‌ కృష్ణ) తన జైత్రయాత్రలో పలు కీలక ఘట్టాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచే అప్పట్లో శంఖారావం పూరించారు. చదువుల నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పలు సందర్భాల్లో ఆయనను పశ్చిమ ప్రథమ సింహాసనం ఎక్కించింది. చదువుకునే రోజుల్లో ఆ బుర్రిపాలెం బుల్లోడు నరసాపురం వైఎన్‌ కళాశాలలో ముందడుగు వేస్తే అక్కడి నుంచి ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలకు వెళ్లి చదువుకుంటూ నంబర్‌వన్‌గా ఎదిగారు. వెండితెరపై మకుటంలేని మహారాజుగా వెలుగుతున్నా రాజకీయ చదరంగంలో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగిన అజాతశత్రువు. జిల్లాలో ఎన్నో సత్కారాలు, సన్మానాలు పొందిన సార్వభౌముడు. పలు చిత్రాల చిత్రీకరణ నిమిత్తం ఇక్కడ పలు ప్రాంతాల్లో పర్యటించిన జగదేకవీరుడు. తొలి నుంచి ఎవరికీ లేనంత మంది అభిమానులను కూడగట్టుకున్న రియల్‌హీరో. జిల్లా పుట్టినిల్లు మెట్టినిల్లు కాకపోయినా అంతకు మించిన ప్రతిష్ఠ.. వైభవం ఇక్కడి నుంచి దక్కించుకున్న కృష్ణపరమాత్ముడు ఆయన. భౌతికంగా దూరమైనా ఆకాశంలో ధ్రువతారగా జిల్లా ప్రజల తేనెమనసులులో ఆయనకు సుస్థిరస్థానం ఉంటుంది.

- న్యూస్‌టుడే, పాలకొల్లు

అన్నదాతలకు ఆత్మబంధువు

నిడమర్రు, న్యూస్‌టుడే: రైతు కుటుంబం నుంచి వచ్చిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు అన్నదాతల కష్టనష్టాల గురించి బాగా తెలుసు. 1989లో వచ్చిన తుపాను కారణంగా పంట పాడై ధాన్యం అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఎంపీగా రైతులను పరామర్శించటానికి నిడమర్రు మండలం పెదనిండ్రకొలను వచ్చిన ఆయన ధాన్యం అమ్మటానికి ఎటువంటి ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు.

నటశేఖరుడు నడయాడిన హేలాపురి

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: నటశేఖరుడు   కృష్ణకు హేలాపురితో విడదీయరాని అనుబంధం ఉంది. ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాలలో 1957 నుంచి 59 వరకు ఇంటర్మీడియట్‌, 1959 నుంచి 62 వరకు ఇదే కళాశాలలో బీఎస్సీ  చదివారని ఆ కళాశాల వర్గాలు తెలిపాయి. కళాశాలకు చెందిన వసతి గృహంలోనే ఆయన ఉండేవారు. చదువుకునే రోజుల్లో ఎంతో చలాకీగా ఉండేవారు. ఏలూరు, భీమవరంలో ఆయన వేదికలు ఎక్కి నాటకాలు వేసేవారని సమకాలికులు తెలిపారు. కళాశాలలో ఆడిటోరియం నిర్మాణంలో తనవంతుగా శ్రమదానం చేశారు. సినీ నటుడు మురళీమోహన్‌ సహవిద్యార్థి కావడంతో చాటపర్రు వెళ్లి వచ్చేవారు.

రజతోత్సవాలకు ముఖ్యఅతిథిగా..

సీఆర్‌ఆర్‌ కళాశాల రజతోత్సవాలకు నటి విజయనిర్మలతో కలిసి కృష్ణ ముఖ్యఅతిథిగా 1975లో వచ్చారు. సందర్భానుసారం   ఏలూరు వచ్చేవారని ఆయన సమకాలికులు తెలిపారు.

విప్లవ వీరుడిగా దీక్షబూని..

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అంటూ.. అల్లూరి సీతారామరాజు పాత్రలో విప్లవ వీరుడి చరిత్రను విశ్వవ్యాప్తం చేశారు. ఆయనను అల్లూరి 125వ జయంతోత్సవాలకు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ‘ఆరోగ్యం సహకరించక రాలేకపోతున్నా.. అన్ని సజావుగా ఉంటే వచ్చే ఏడాది జులైలో జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని.. కృష్ణ చెప్పారని ఉత్సవ కమిటీ నాయకులు నడింపల్లి నానిరాజు తెలిపారు.
పాలకొల్లు, న్యూస్‌టుడే: జాతీయ నాటిక పోటీల సందర్భంగా 1998 మే 24న సూపర్‌ కృష్ణ, విజయనిర్మల దంపతులను పాలకొల్లు పురపాలిక ఓపెన్‌ థియేటర్‌లో సత్కరించారు. కృష్ణను చూసేందుకు వచ్చిన అభిమానులతో పట్టణం కిక్కిరిసిపోయింది.

పెదరామయ్యతోనే  పోటీపడతా..

1989లో ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. తెదేపా రాజకీయ దిగ్గజం బులిరామయ్యతో పోటీ పడటం ఇబ్బంది కావచ్చని సన్నిహితులు చెబితే పెదరామయ్యతోనే(ఎన్‌.టి.ఆర్‌) పోటీపడే నేనే మాత్రం వెనక్కి తగ్గనని పోటీ చేశారని కృష్ణ సన్నిహితుల్లో ఒకరైన భీమవరానికి చెందిన వేగేశ్న కనకరాజుసూరి చెప్పారు.

ఎవరెళ్లినా   భోజనం చేసి వెళ్లాల్సిందే

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: గోదావరి జిల్లాల్లో కృష్ణకు వీరాభిమానులున్నారు. ఆయన  ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయనిదే పంపించరని, గోదావరి జిల్లాల్లో ఎక్కడ షూటింగ్‌ జరిగినా ఆయనను చూడటానికి వచ్చే అభిమానుల కోసం రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా భోజనాలు తెప్పించే వారని తాడేపల్లిగూడేనికి చెందిన లింగంపల్లి గాంధీ, శింగం సుబ్బారావు, వి.పాండు గుర్తు చేసుకున్నారు. ః తాడేపల్లిగూడేనికి చెందిన రేలంగి వెంకట్రామయ్య అంటే కృష్ణకు మంచి అభిమానం. మద్రాస్‌లో వీరిద్దరూ ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. దీంతో రేలంగి కుటుంబ సభ్యులకు తరచూ ఫోన్‌చేసి  పలకరిస్తూ ఉండేవారు.

ఎన్నో చిత్రాలు..జ్ఞాపకాలు

చదువు, రాజకీయమేగాక జిల్లాలోని పలు ప్రాంతాలు, అంశాలతో ముడిపడిన చిత్రాల్లోనూ కృష్ణ హీరోగా నటించారు. చిత్రీకరణ, విడుదల సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వచ్చారు.
1995లో విడుదలైన తెలుగువీర లేవరా కృష్ణ 300వ సినిమా. దీని విడుదలకు అభిమానులు పాలకొల్లు పట్టణంలో 300 బ్యానర్లు కట్టి పెద్దఎత్తున వేడుకలు నిర్వహించడం సంచలనమైంది.

‘కొల్లేటి కాపురం’తో.. ఆకివీడు, న్యూస్‌టుడే: కొల్లేరు ప్రాంత ప్రజల జీవనవిధానం, స్థితిగతులు ఇతివృత్తంగా 1976లో ‘కొల్లేటి కాపురం’ సినిమా తీశారు.అధిక శాతం ఆకివీడు, కొల్లేరు పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరిగింది. ఇందుకు రెండు దఫాలుగా కృష్ణ సుమారు మూడు నెలలకు పైగా ఆకివీడులోనే బస చేశారు.

చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలోని  ఓ పాటను పెదపాడులో చిత్రీకరించారు. మొదటిసారి ఎంపీ అయ్యాక కొడుకు దిద్దిన కాపురం సినిమా శతదినోత్సవాలను ఆయన చదువుకున్న సీఆర్‌రెడ్డి కళాశాలలోనే నిర్వహించారు. మహేశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు.

తొలి చిత్రం తేనెమనసులతో మొదలై..

పోలవరం, న్యూస్‌టుడే: తొలి చిత్రం తేనెమనసులు చిత్రీకరణ పోలవరం మండలం కొరుటూరు, తెల్లదిబ్బల గ్రామాల మధ్య సాగింది. పాపికొండల నడుమ పడవపై పాట సన్నివేశాలు చిత్రీకరణ జరిగిందని ఇక్కడి గిరిజనులు జ్ఞాపకం చేసుకున్నారు. పాడిపంటలు చిత్రంలో పొలాల్లో నాగలితో దున్నుతున్న సన్నివేశాలను ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చిత్రీకరించారు. బుర్రిపాలెం బుల్లోడు చిత్రానికి సంబంధించి ఒక పాటను పోలవరం సమీపంలో గోదావరి ఒడ్డున తెరకెక్కించారు.

హామీ ఇస్తే నెరవేర్చాల్సిందే!

నిడమర్రు, న్యూస్‌టుడే: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా కృష్ణ నిలుస్తారు. ఆయన ఏలూరు ఎంపీ ఉన్న సమయంలో పెదనిండ్రకొలను వచ్చారు. ఈ సందర్భంగా సన్నిహితులు కొల్లేరు ముంపు సమస్య నివారణకు రెగ్యులేటర్‌ నిర్మిస్తానని హామీ ఇవ్వాలని సూచించారు. దీనిపై స్పందించిన కృష్ణ హామీ ఇస్తే నెరవేర్చాల్సిందేనని, లేకపోతే ఇవ్వకూడదని చెప్పిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.


పాలకొల్లు: సత్కారం అందుకుంటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని