logo

జోరుగా బేరాలు.. పట్టాల అమ్మకాలు

కైకలూరులోని జగనన్న గ్రీన్‌ విలేజ్‌లో చాలా స్థలాలు ఇప్పటికే అమ్మకాలు జరిగిపోయాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ మట్టివ్యాపారి ఒక్కో పట్టా రూ.2 లక్షల చొప్పున ఏకంగా ఆరు   కొనుగోలు చేశారు.

Updated : 25 Nov 2022 06:20 IST

జగనన్న కాలనీల్లో రహస్య ఒప్పంద పద్ధతిలో తంతు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే, పెనుమంట్ర, కైకలూరు

కైకలూరులోని జగనన్న కాలనీ

* కైకలూరులోని జగనన్న గ్రీన్‌ విలేజ్‌లో చాలా స్థలాలు ఇప్పటికే అమ్మకాలు జరిగిపోయాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ మట్టివ్యాపారి ఒక్కో పట్టా రూ.2 లక్షల చొప్పున ఏకంగా ఆరు   కొనుగోలు చేశారు. ఓ తాపీ మేస్త్రీ 4, ఓ వైకాపా నాయకుడు రెండు స్థలాలు కొనుక్కుని ఒప్పందాలు రాయించుకున్నారు. ఇంకా చాలా స్థలాల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. స్థలం వాస్తు, సౌకర్యాలను బట్టి రూ.2-3లక్షల వరకూ అమ్ముకుంటున్నారు.

* ఏలూరులోని చొదిమెళ్ల పరిధిలోని లక్ష్మీపురం జగనన్న కాలనీలో ఓ లబ్ధిదారుకి ఇళ్లు కట్టుకునే స్తోమత లేదు. సిబ్బంది ఇంటి నిర్మాణం చేపట్టాలని లేకుంటే వేరే లబ్ధిదారుకి అప్పగిస్తాం అని ఒత్తిడి చేశారు. దీంతో తనకు ఇచ్చిన పట్టాని ఒప్పందం ప్రకారం రూ.2 లక్షలకు అమ్మేశారు.

నిరుపేదల సొంతింటి కల సాకారానికి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా లేఅవుట్లలో ఈ అమ్మకాల వ్యవహారం చాప కింద నీరులా జరుగుతోంది. ఒప్పందాలతో విక్రయాలు సాగిపోతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ నాయకుల అండతో స్థిరాస్తి వ్యాపారులే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒప్పందాలతోనే వ్యవహారం.. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపట్టాల క్రయవిక్రయాలకు అవకాశం లేదు. ఇవి రిజిస్ట్రేషన్‌ కావు. దీంతో కొందరు మధ్యవర్తులు, నాయకులు ఒప్పంద విధానంలో విక్రయాలు చేస్తున్నారు. ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారు, ఇప్పటికే ఇళ్లు ఉన్నవారినే లక్ష్యంగా బేరాలు పెడుతున్నారు. రూ.100 స్టాంపు కాగితంపై అంతా రాసుకుంటున్నారు. ఇద్దరు మధ్యవర్తులతో సంతకాలు చేయిస్తున్నారు. ఒప్పందంలో ఇళ్లు కట్టే వరకూ లబ్ధిదారుకి ప్రభుత్వం ఇచ్చే అని ఫలాలు కొనుగోలుదారుకే అందాలని..స్పష్టంగా రాసుకుంటున్నారు. ఇల్లు కట్టిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయం కూడా కొనుగోలు దారుడికి చెందాలి. నిర్మాణం పూర్తి అయ్యేదాక లబ్ధిదారుడే యజమానిలా వ్యవహరించాలి అని ఒప్పందం చేసుకున్నారు. ఈ అమ్మకాల పుణ్యమా అని మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారు.

కారణాలెన్నో.. లబ్ధిదారులు పట్టాలు అమ్ముకోవడానికి క్షేత్రస్థాయిలో చాలా కారణాలు కనిపిస్తున్నాయి.  లబ్ధిదారుల్లో ఇప్పటికే చాలా మందికి ఇళ్లు ఉన్నాయి. నాయకుల చలువతో వారికే మళ్లీ పట్టాలు వచ్చాయి. దీంతో వారు ఇంటి నిర్మాణం చేసేందుకు ఆసక్తిగా లేరు.  ఇటీవల ఏలూరు సమీపంలోని చాటపర్రు పరిధిలో పట్టాలు ఇచ్చి నిర్మాణాలు మొదలు పెట్టని 150 మందిని గుర్తించారు. వెంటనే పనులు మొదలు పెట్టకుంటే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఇక్కడే కాదు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పట్టాలు అమ్ముకోవడానికి ప్రధాన కారణం ఇదే. స్తోమత లేనివారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1.8 లక్షలతో నిర్మాణం చేయటం సాధ్యం కావటం లేదు. అధికారులు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇళ్లు కట్టుకునేందుకు అసక్తిగా ఉన్న వారితో బేరం పెట్టుకుంటున్నారు.  గ్రామానికి దూరంగా పట్టాలు కేటాయించటం..ఒక్కసెంటులో ఇల్లు కట్టినా చాలదన్న భావనతో కొందరు అమ్ముకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం.. పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు అమ్మటం..కొనటం రెండూ నేరాలే. గుర్తిస్తే పట్టా రద్దు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మధ్యవర్తుల మాటలు విని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి.

అరుణ్‌బాబు, జేసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని