logo

కన్నుపడితే పాగా

జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ, దేవాదాయ, అటవీ, రెవెన్యూ, జలవనరులు..

Updated : 26 Nov 2022 06:27 IST

ప్రభుత్వ స్థలాలు పరుల పరం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ: జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పంచాయతీ, దేవాదాయ, అటవీ, రెవెన్యూ, జలవనరులు.. ఇలా అన్ని శాఖలకు సంబంధించిన స్థలాలు క్రమంగా ఆక్రమణల చెరలోకి వెళ్లిపోతున్నాయి. ముందుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చదును చేసి చిన్న గుడిసె వేసి అక్రమించుకుంటున్నారు. కొద్ది రోజులకు పక్కా ఇళ్లు, దుకాణాలు కట్టి అద్దెలకు ఇస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి ఒప్పంద పద్ధతిలో అమ్ముకుని వెళ్లిపోతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాలువలపై వందల సంఖ్యలో  ఆక్రమణలున్నా...  అధికారులు సైతం వీటిని గుర్తించారు. తొలగింపు మాత్రం జరగటం లేదు. దీంతో కాలువల్లో నీటి ప్రవాహానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నీటి ఎద్దడి సమయంలో శివారు ప్రాంతాలకు నీరు వెళ్లటం చాలా కష్టమవుతోంది. గ్రామాల్లో పంచాయతీ స్థలాలు చాలా చోట్ల ఆక్రమణకు గురయ్యాయి.


ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందా అంతే.. వారి కన్ను పడితే అది పంచాయతీ స్థలమా.. ఇరిగేషన్‌ జాగానా అని చూడకుండా కబ్జా చేస్తున్నారు. ముందు చిన్న పాకలు వేసి, కొద్ది రోజులకు రేకుల షెడ్డుగా మారుస్తున్నారు. మరికొన్ని రోజులకు నాయకులకు ముడుపులిచ్చి పక్కాగా భవనాలు నిర్మించేస్తున్నారు.డిమాండ్‌ రాగానే అమ్మేస్తుండటం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులది ప్రేక్షకపాత్రే.


నాయకుల అండతోనే

అక్రమణదారులకు ప్రభుత్వ స్థలాలు అమ్ముకునేంత ధైర్యం నాయకులే ఇస్తున్నారు.  ఏలూరు తమ్మిలేరు గట్టు ఆక్రమణలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లే కీలక భూమిక పోషిస్తున్నారని సమాచారం. పైస్థాయి నాయకుల అండతో వీళ్లే కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా గట్టు ఆక్రమించాలన్నా.. ఆక్రమించిన స్థలాలు విక్రయించాలన్నా..పక్కా నిర్మాణాలు చేపట్టాలన్నా నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుస్తోంది.  వారికి ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తే అధికారులను ఆ వైపు చూడొద్దంటూ ఆదేశిస్తున్నారు. నాయకులు ఆజ్ఞాపిస్తే రహదారి పక్కన నివాసం ఉంటున్న పాకలను పీకేసి..బడుగుజీవులను రోడ్డు పాలు చేస్తున్న అధికారులు వేళ్లూనుకుపోయిన  ఆక్రమణలను ఎందుకు తొలగించటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న నిర్మాణాన్ని ఏలూరు పరిధిలోని రజకుల కాలనీ సమీపంలో తమ్మిలేరు గట్టుపై చేస్తున్నారు. ఈ స్థలం ఎవరో ఆక్రమించుకుంటే వారి నుంచి కొనుగోలు చేసి రూ.లక్షలు వెచ్చించి, పక్కా ఇల్లు కట్టేస్తున్నారు. ఇక్కడ ఇదొక్కటే కాదు. చాలా నిర్మాణాలున్నాయి. కొన్ని పునాదుల స్థాయిలో ఉంటే మరికొన్ని శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి.  ఇప్పటికే అశోక్‌నగర్‌ నుంచి దిగువన ఉన్న సాయి నగర్‌(వెంకటాపురం) వరకూ ఏటి గట్టుపై దాదాపు 2 కిమీ పొడవునా అక్రమ నిర్మాణాలు చేపట్టారు.  వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోగా కొత్త నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది.


ఇది దెందులూరు మండలం కొవ్వలిలోని పంట కాలువ. వందల ఎకరాలకు నీరు అందిస్తోంది. కొందరు ఆక్రమణదారుల నిర్వాకంతో ఇది కాస్తా చిక్కిపోయింది. ఆర్‌అండ్‌బీ రహదారికి, పంట కాలువకు మధ్య ఉన్న స్థలంలో పాగా వేశారు. ముందు కాలువలో మూడొంతులు భాగాన్ని మట్టితో నింపేశారు. వెంటనే అక్కడ గడ్డివాము, షెడ్డు ఏర్పాటు చేసేశారు. ఇక్కడి తూము వెడల్పుతో సమానంగా కాలువ ఉండేది. ప్రస్తుతం అసలు కనిపించనంత చిన్నగా మార్చేశారు. ప్రధాన రహదారి పక్కనే   ఇంత జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.  


ఈ చిత్రంలో దుకాణాలున్న ప్రాంతం దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని పంచాయతీ స్థలం. పంచాయతీ వారు చక్కగా దుకాణాలు కట్టి అద్దెకు ఇచ్చారనుకుంటే పొరపాటే. ఈ స్థలాలన్నీ చాలా ఏళ్ల నుంచి ఆక్రమణ చెరలో ఉన్నాయి. 2017లో రహదారి విస్తరణలో వీటిని చదును చేశారు. కొద్ది రోజులకే ఆక్రమణదారులు పాగా వేసి పక్కా నిర్మాణాలు కట్టి అద్దెలకు ఇచ్చుకుంటున్నారు. ఈ ఆక్రమణల తొలగింపుపై రెండు సార్లు స్పందనలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు 2019లో సర్వే చేసి ఇవి ఆక్రమణలుగా గుర్తించి నోటీసులు ఇచ్చి మమా అనిపించారు. 2020లో ఇదే స్థలాన్ని 10 పడకల వైఎస్‌ఆర్‌ క్లినిక్‌ నిర్మాణానికి కేటాయించారు. రాజకీయ ఒత్తిడితో దీనిని వేరే ప్రాంతానికి మార్పించారు. ఇటీవలే ఇందులోని 10 సెంట్ల స్థలాన్ని ఓ ఆక్రమణదారు రూ.21 లక్షలకు విక్రయించినట్లు సమాచారం.   రూ.లక్షల విలువైన పంచాయతీ స్థలం అధికారుల అలసత్వంతో అన్యులపరమైంది.

పరిశీలించి చర్యలు

జిల్లాలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాను. అక్రమణదారులు తొలగించి ప్రభుత్వ స్థలాలను ఆదాయ వనరులుగా భవిష్యత్తు అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటాను. 

ప్రసన్న వెంకటేశ్‌, కలెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని