logo

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

కాళ్ల మండలం ఏలూరుపాడులో చేపల చెరువుల మధ్య ఉన్న రేకుల షెడ్డులో క్రికెట్‌  బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు.

Updated : 26 Nov 2022 06:30 IST

చెరువుల మధ్యలో షెడ్డులో కార్యకలాపాలు

నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ శ్రీనాథ్‌, సీఐ గీతారామకృష్ణ, ఎస్సై మల్లికార్జునరెడ్డి

ఏలూరుపాడు (ఉండి), న్యూస్‌టుడే: కాళ్ల మండలం ఏలూరుపాడులో చేపల చెరువుల మధ్య ఉన్న రేకుల షెడ్డులో క్రికెట్‌  బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్‌ తెలిపారు. కాళ్ల పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన   వివరాలు వెల్లడించారు. ఆకివీడు సీఐ ఎం.గీతారామకృష్ణకు అందిన సమాచారం మేరకు ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి సిబ్బంది కలిసి ఏలూరుపాడు శివారులోని చేపల చెరువుల మధ్య ఉన్న షెడ్డులో గురువారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కన్నా మహేష్‌ (ఏలూరుపాడు), విప్పర్తి యోహాను (కమతవానిగూడెం)లను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరుపాడు గ్రామానికి కిళ్ల సందీప్‌వర్మ, నల్లగచ్చుల శ్రీనివాస్‌లు పరారయ్యారు. వీరు తరచూ బెట్టింగులు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నిఘా ఉంచి దాడులు జరిపినట్లు డీఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో రూ.12,500 నగదు, 9 చరవాణులు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాప్‌టాప్‌, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోపల్లెలో గంజాయి, ఏలూరుపాడులో బెట్టింగ్‌ ముఠాలను పట్టుకున్న సీఐ గీతారామకృష్ణ, ఎస్సై మల్లికార్జునరెడ్డిలకు రివార్డుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని డీఎస్పీ తెలిపారు.

కోపల్లెలో గంజాయి విక్రేతల అరెస్టు

కాళ్ల (ఉండి), న్యూస్‌టుడే: కాళ్ల మండలం కోపల్లె ఉన్నత పాఠశాల సమీపాన గంజాయి విక్రయాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాళ్ల పోలీస్‌స్టేషన్లో డీఎస్పీ శ్రీనాథ్‌ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు గురువారం రాత్రి ఆ ప్రాంతంలో దాడులు చేసి కాళ్ల మండలం బొండాడ గ్రామపరిధి హరిచంద్రరావుపేట వాసి కొండపర్తి మణికంఠ (సత్యం), పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన బాలం రవికుమార్‌ (రవి)లను అదుపులోకి తీసుకుని 320 గ్రాముల బరువున్న 14 గంజాయి పొట్లాలు, రెండు చరవాణులు,  ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని