logo

చేజారినా.. తిరిగొచ్చాయ్‌!

అపహరణకు గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.25 లక్షల విలువైన 152 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ యు.రవిప్రకాశ్‌ చెప్పారు.

Published : 27 Nov 2022 04:30 IST

రూ.25 లక్షల విలువైన చరవాణులు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాశ్‌

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అపహరణకు గురైన, పోగొట్టుకున్న సుమారు రూ.25 లక్షల విలువైన 152 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ యు.రవిప్రకాశ్‌ చెప్పారు. భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చరవాణుల చోరీ, పోగొట్టుకున్న ఘటనలపై ఇప్పటి వరకు 200 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటికి సంబంధించి 152 చరవాణులు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా చరవాణి దొరికితే సమీప పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా విక్రయించినవాటిని కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావద్దన్నారు.

వాట్సాప్‌ నంబరుతో..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చరవాణుల అపహరణ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఫిర్యాదుల నమోదు కోసం రెండు నెలల క్రితం ప్రత్యేక వాట్సాప్‌ నంబరును పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. చరవాణి అపహరణకు గురైనప్పుడు దాని వివరాలు, ఐఎంఈఐ నంబరు, ఎక్కడ, ఏ సమయంలో పోయిందో తదితర వివరాలను 91549 66503 నంబరుకు వాట్సాప్‌ ద్వారా పంపాలి. దీనికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సీఐ అహ్మదున్నీసా, ఎస్సై విశ్వనాథబాబు, హెడ్‌కానిస్టేబుళ్లు రాంకుమార్‌, వి.జి.ఎస్‌ కుమార్‌, జి.రామకృష్ణ, కానిస్టేబుళ్లు కె.పాపారావు, కె.ప్రసాదబాబు, సుధారాణి, ఉమామహేష్‌, భాస్కరాచారిలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదులపై ఈ బృందం విచారణ జరపగా కొన్ని చరవాణులు దొరికాయి. మరికొన్నింటిని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో మరో సిమ్‌ వేసి ఉపయోగిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులను అప్పగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని