logo

ఇసుక గూడు కట్టాలన్నా కష్టమే!

యలమంచిలి మండల కేంద్రంలో 150 మంది పేదలకు ఇళ్ల స్థలాలను రెండేళ్ల కిందట కేటాయించారు. కొలతలేసి సరిహద్దు రాళ్లేయడం మినహా నేటికీ కనీసం నడకదారి నిర్మించకపోవడంతో ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. 

Updated : 27 Nov 2022 04:56 IST

వసతులకు దూరంగా పేదల లేఅవుట్లు
ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షలకు పూర్తయినవి 28 వేల ఇళ్లే
పాలకొల్లు, న్యూస్‌టుడే

కొమ్ము చిక్కాలలో లేఅవుట్‌

* యలమంచిలి మండల కేంద్రంలో 150 మంది పేదలకు ఇళ్ల స్థలాలను రెండేళ్ల కిందట కేటాయించారు. కొలతలేసి సరిహద్దు రాళ్లేయడం మినహా నేటికీ కనీసం నడకదారి నిర్మించకపోవడంతో ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. ఈ లేఅవుట్‌కు రూ.12 లక్షలతో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు చేసి ఏడాది గడిచింది. ఇప్పటి వరకు తట్ట మట్టేసింది లేదు. ఇటువంటి చోట ఇల్లు కాదు కదా ఇసుక గూడు కట్టాలన్నా కష్టమేనని లబ్ధిదారు ఎన్‌.భవాని వాపోయారు.

ఉమ్మడి జిల్లాలో 80 శాతం పేదల లేఅవుట్లలో కనీస వసతులు సమకూరకపోవడంతో లబ్ధిదారులకు గృహయోగం దక్కడం లేదు. నీరు, విద్యుత్తు సౌకర్యాలు ఎలా ఉన్నా కనీసం గృహనిర్మాణ సామగ్రి తరలించేందుకు రహదారులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించడం లేదు. లక్ష్యం లక్షల్లో ఉండగా నిర్మాణం పూర్తయినవి 20శాతం కూడా లేవు. కలెక్టర్లు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక, సిమెంట్‌ కొరత కూడా నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది.

వీటి మాటేంటో... లేఅవుట్లలో పాఠశాలలు, పార్కులు, సామాజిక భవనాలు, ఆసుపత్రులు, శ్మశానం వంటి వసతులు కల్పించాల్సి ఉంది. కనీసం రోడ్లు నిర్మించలేని పాలకులు ఇవన్నీ ఎప్పటికి పూర్తి చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కష్టపడి ఇంటి నిర్మాణం పూర్తిచేసినా మౌలిక వసతుల కోసం నిత్యం అవస్థలు పడాలనే ఆలోచనలో ఎక్కువ మంది లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు.

అవసరముంటేగా...

లబ్ధిదారుల్లో చాలామందికి సొంతిళ్లు ఉండటం వల్ల కచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టే అవసరం లేనివారు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. రాజకీయ అవసరాల కోసం కొందరు నాయకులు తమకు కావాల్సిన వారికి కేటాయించిన స్థలాలు లేఅవుట్లలో అనేకం ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు ఇల్లు అవసరం లేకపోయినా ప్రభుత్వం నుంచి వచ్చేదే కదా అని పట్టాలు పొందినవారు కొందరున్నారు. ఇవన్నీ చేతులు మారడానికి సిద్ధంగా ఉన్న స్థలాలే అని బహిరంగ విమర్శలు వినపడుతున్నాయి.

* పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో 18 గ్రామాలకు చెందిన సుమారు 1600 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు.  ఈ లేఅవుట్‌కు రహదారులు వేయాలంటేనే ఏడాది సమయం పట్టేలా ఉందని దీనిని రెండో విడతకు మళ్లించారు.

ఉమ్మడి జిల్లాలో కేటాయించిన ఇళ్లు 1,70,259
నేటికీ ప్రారంభం కానివి 5980
పూర్తయినవి 28,341

యూనిట్‌ మొత్తం అంతంతే..

రోజురోజుకు పెరిగిపోతున్న నిర్మాణ సామగ్రి ధరలతో పోల్చుకుంటే లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్‌ మొత్తం రూ.1.80 లక్షలు మొదట్నుంచీ అంతే ఉంది.  పెంచకపోవడం లబ్ధిదారులకు నిరాశ మిగులుస్తోంది. కూలీ ధరల నుంచి ఇసుక, సిమెంట్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో యూనిట్‌ ధర కనీసం రూ.3 లక్షలకు పెంచితే నిర్మాణాలు ఆశాజనకంగా ఉంటాయనేది లబ్ధిదారుల మాట. దీనిపై నరసాపురం గృహనిర్మాణశాఖ ఈఈ వీవీఎస్‌ సిద్ధాంతిని సంప్రదించగా ఒక్క నరసాపురం డివిజన్‌లోనే 32 చోట్ల రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైందన్నారు. యలమంచిలి మండలంలో రెండు లేఅవుట్లకు టెండర్లు పూర్తయ్యాయని పనులు ప్రారంభించాల్సి ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని