logo

ఇలా ఇంకెంత కాలం!

మాతా శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.

Published : 28 Nov 2022 06:17 IST

అంగన్‌వాడీ భవనాలకు మోక్షం ఎప్పుడో ?
భీమవరం అర్బన్‌, పెనుమంట్ర, న్యూస్‌టుడే

రాయలంలో వినియోగంలోకి రాని అంగన్‌వాడీ కేంద్రం

మాతా శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఇప్పటికీ చాలాచోట్ల గాలి, వెలుతురు సక్రమంగా లేని గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గతంలో చాలాచోట్ల స్థల సమస్య ఉండేది. అది పరిష్కారమై భవనాల నిర్మాణానికి నిధులొచ్చినా ఆ పనులు కొలిక్కి రావడం లేదు.


నరసాపురం మం డలం రుస్తుంబాదలో అంగన్‌వాడీ భవనం ఇలా శ్లాబ్‌ దశలో నిలిచిపోయింది. నిధుల కొరతే దీనికి కారణంగా తెలుస్తోంది. సొంత భవనం లేకపోవడంతో ఈ కేంద్రం పరిధిలో పిల్లలను చిన్న అద్దె గదిలో ఉంచి పాఠాలు చెప్పాల్సి వస్తోంది. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా 30 వరకు ఉంటాయని అంచనా.


భీమవరం మండలం తుందుర్రులో పీహెచ్‌సీ సమీపాన రెండు అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణాన్ని లక్షల వ్యయంతో చేపట్టారు. నిధుల కొరత అంటూ పనులను మధ్యలో నిలిపివేయడంతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి.


ఇదీ పరిస్థితి..

అద్దె గదుల్లో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాలకు పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామాల్లో రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ మొత్తానికి సదుపాయాలున్న ఇళ్లు అద్దెకు దొరికే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఈ కారణంగా ఇరుకు గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

పెనుమంట్ర మండలం ఓడూరు దళితవాడలో అద్దె భవనంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కనీస వసతులు లేవు. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా సొంత భవనం నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.

వీరవాసరం మండలం వీరవల్లిపాలెంలో రూ.లక్షలు ఖర్చుతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం శ్లాబ్‌ వేసి వదిలేశారు. నిధులు లేకపోవడంతో అది అసంపూర్తిగా నిలిచిపోయింది. ఏడాది కాలంగా అదే పరిస్థితి.


57 చోట్ల కొత్త భవనాలు

‘నాడు- నేడు’ పథకంలో జిల్లాకు 57 కొత్త భవనాలు మంజూరవగా ఇప్పటికే పలుచోట్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల పనులు మొదలయ్యాయి. గతంలో చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలపై కలెక్టర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదనపు నిధులతో త్వరలోనే వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.

సుజాతరాణి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని