logo

నిరంతర అధ్యయనంతోనే వృత్తిలో రాణింపు

న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నిబద్ధత, నైతిక విలువలతోపాటు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఏపీ హైకోర్జు జడ్జి జస్టిస్‌ ఎ.వెంకçశేషసాయి అన్నారు.

Updated : 28 Nov 2022 06:59 IST

మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వెంకట శేషసాయి. వేదికపై (ఎడమ వైపు నుంచి) ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కృష్ణారెడ్డి, జస్టిస్‌ సుబ్బారెడ్డి, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ రామారావు, జస్టిస్‌ జయసూర్య, జిల్లా జడ్జి పురుషోత్తమకుమార్‌ తదితరులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నిబద్ధత, నైతిక విలువలతోపాటు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఏపీ హైకోర్జు జడ్జి జస్టిస్‌ ఎ.వెంకట శేషసాయి అన్నారు. ఏపీ బార్‌ కౌన్సిల్‌, ఏలూరు బార్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరంతర అధ్యయనంతోనే న్యాయవాద వృత్తిలో రాణించగలరన్నారు. పౌర శిక్షాస్మృతి పరిధిలోని మధ్యంతర పిటిషన్లు, సమగ్ర విచారణ, కేసు తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. వివిధ కేసుల్లో న్యాయమూర్తుల తీర్పులను బాగా చదవాలన్నారు. మరో అతిథి ఏపీ హైకోర్టు జడ్జి, పశ్చిమగోదావరి జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడుతూ నేర సంబంధిత కేసుల్లో సమగ్ర పరిశీలన ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా 161 సీఆర్‌పీసీకి సంబంధించిన అంశాలను వివరించడంతో పాటు న్యాయవాదుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. తొలుత జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయదేవత విగ్రహానికి న్యాయమూర్తులు పూలు వేసి వందనం చేశారు. వేద పండితులు న్యాయమూర్తులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వైనాల జయసూర్య, జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జి.రామారావు, జిల్లా జడ్జి సి.పురుషోత్తమకుమార్‌, జాతీయ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రామిరెడ్డి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు బీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని