logo

భాజపాతోనే బీసీల అభ్యున్నతి

భాజపాతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 28 Nov 2022 06:17 IST

అభివాదం చేస్తున్న ఎంపీ లక్ష్మణ్‌, సోము వీర్రాజు, సత్యనారాయణ తదితరులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: భాజపాతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులోని ఇండోర్‌ మైదానం ఆవరణలో ఆదివారం బీసీ సామాజిక చైతన్య సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్‌ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను చేసిన ఘనత భాజపాకే దక్కుతుందన్నారు. ఏ పార్టీ కూడా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఓబీసీ కమిషన్‌ను రాజ్యాంగబద్ధం చేశారన్నారు. త్వరలో జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక రాబోతోందని, క్రీమిలేయర్‌ పరిధి రూ.12 లక్షలకు పెరగనుందని తెలిపారు. రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధనకు బీసీలంతా సిద్ధం కావాలని, కుటుంబ పాలనకు ప్రాధాన్యమిచ్చే పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ గణాంకాలను చేపట్టకుండా కేంద్రమే నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. రాజధాని, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని చెబుతున్న ముఖ్యమంత్రి వాటికి నిధులు ఇవ్వలేదన్నారు. అనంతరం లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.గోపీ శ్రీనివాస్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మధుకర్‌, జాతీయ కార్యదర్శి పార్థసారథి, భాజపా క్రమశిక్షణ సంఘం నాయకుడు పాకా సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె.సుధాకర కృష్ణ, గారపాటి చౌదరి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని