logo

అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పట్టివేత

సింధనూరు తాలూకా గాంధీనగర్‌లో 20 రోజుల కిందట సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యక్తి ముళ్లపూడి భాస్కరరావు ఇంట్లో దోపిడీ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

Published : 28 Nov 2022 06:17 IST

సింధనూరు పోలీసుల ఎదుట నిందితులు, స్వాధీనం చేసుకున్న కార్లు, నగలు, నగదు

సింధనూరు, న్యూస్‌టుడే : సింధనూరు తాలూకా గాంధీనగర్‌లో 20 రోజుల కిందట సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యక్తి ముళ్లపూడి భాస్కరరావు ఇంట్లో దోపిడీ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సింధనూరు పట్టణం, గాంధీనగర్‌, పక్కన మాన్విల్లో జరిగిన దోపిడీలు ఈ ముఠా చేసినవే. రాయచూరులోని ఓ శ్రీమంతుని ఇంట్లో కూడా దోపిడీకి పన్నాగం వేయగా.. పక్కా ప్రణాళికతో ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నామని రాయచూరు జిల్లా ఎస్పీ బి.నిఖిల్‌ సింధనూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరి నుంచి రెండు కార్లు, 520 గ్రాముల బంగారు నగలు, రూ.1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. గడిచిన రెండు నెలలుగా సింధనూరులో వరుస దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఈ ముఠా ఆకృత్యాలే. వీటికి సుజాత అనే మహిళ నేతృత్వం వహించేది. స్థానిక ఆదర్శ కాలనీలో అద్దె ఇంట్లో ఉండే ఈ సుజాతది ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం సమీపాన దువ్వాడ. సింధనూరు కేంద్రంగా చేసుకుని రాయచూరు, మాన్విల్లోనూ ఇళ్లను అద్దెకు తీసుకుంది. తొలుత స్థానికంగా శ్రీమంతులతో పరిచయాలు పెంచుకుని వారి పూర్తి వివరాలు సేకరించేది. ఇంట్లో వ్యక్తులు, ఇళ్ల చిరునామాలు, చుట్టుపక్కల ప్రజల తీరు, సీసీ కెమేరాలు తదితర వివరాలు సేకరించి దోపిడీకి పథకం సిద్ధం చేసేది. ఈ పూర్తి సమాచారాన్ని ముగ్గురు యువకుల ముఠాకు అందజేసి.. పని పూర్తయ్యాక నలుగురూ వాటాలు పంచుకునేవారు.


యువకులు ముగ్గురూ గోదావరి జిల్లా వారు..

రామకృష్ణరాజు (భీమవరం), కుమారరాజు, లక్ష్మణ్‌ (నరసాపురం) ఈ ముగ్గురూ సుజాత ఇచ్చిన సమాచారంతో దోపిడీకి దిగేవారు. ప్లాస్టిక్‌ పిస్తోలు, రాడ్లు వీరి ఆయుధాలు. ముగ్గురూ 25 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు. ఇందులో రామకృష్ణరాజు, కుమారరాజా ఇద్దరూ ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమెస్ట్రీ పట్టభద్రులని ఎస్పీ వివరించారు. గాంధీనగర్‌ దోపిడీ సమయంలో ఒక కారు మాత్రం ఉండేది. ఆ దోపిడీ తరువాత బెంగళూరులో మరో కారు కొనుగోలు చేశారు. గాంధీనగర్‌ ఇంట్లో దోపిడీలో జతగా లాక్కొచ్చిన సీసీ కెమెరా డీవీఆర్‌ను ఎక్కడో కాలువలో విసిరేశారని తెలిపారు. సెప్టెంబరు నుంచే ఈ ముఠాపై కన్ను వేసి ఉంచామని, 20 రోజులుగా పక్క రాష్ట్రానికి వెళ్లి ఎంతో కష్టపడగా ఈ ముఠా చిక్కిందని ఎస్పీ తెలిపారు. ఇందుకు సింధనూరు పోలీసులను అభినందిస్తున్నానని తెలిపారు. సింధనూరు పోలీసు బృందానికి ఎస్పీ రూ.25 వేల నగదు బహుమతిగా అందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శివకుమార్‌, డీఎస్పీ వెంకటప్ప నాయక్‌, సింధనూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని