logo

అనుమతులు లేకుండానే వైద్యం!

జిల్లాలోని పట్టణాల్లో కొంత మంది అర్హత లేకుండా వైద్యం చేసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1200 ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లున్నాయి.

Published : 28 Nov 2022 06:17 IST

తణుకు, న్యూస్‌టుడే

* తణుకు ఎస్‌.శోభన్‌బాబుగారి వీధిలో నిర్వహిస్తున్న సన్‌ ఆసుపత్రిని వైద్యాధికారులు తనిఖీ చేసి ఇటీవల సీజ్‌ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు, వైద్యుని డిగ్రీ తదితర అంశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో అసలు విషయం బయటపడింది.


* తణుకులో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యం చేస్తూ క్లినిక్‌ను నిర్వహిస్తున్న వైద్యుడు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశారు.


* తణుకు శ్రీకర ఆసుపత్రిని విజిలెన్స్‌ అధికారులు ఇటీవల పరిశీలించి ధ్రువపత్రాలు సరిగా లేకపోవడంతో పాటు రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని సీజ్‌ చేశారు.


* తాడేపల్లిగూడెంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఆసుపత్రిని మూసివేశారు.  

ఆసుపత్రిలో అధికారుల తనిఖీ (పాత చిత్రం)

జిల్లాలోని పట్టణాల్లో కొంత మంది అర్హత లేకుండా వైద్యం చేసేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1200 ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లున్నాయి. ఏలూరు, తణుకు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, భీమవరం, తాడేపల్లిగూడెంలలో కొన్ని ప్రైవేటు వైద్యశాలలకు అనుమతులు లేవు. రష్యా, ఉక్రెయిన్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల్లో ఎండీ వైద్య విద్య పూర్తి చేసిన పలువురు ఇక్కడ ఎండీగా చలామణి అవుతున్నారు. అక్కడ ఎండీ చేసినా ఇక్కడ ఎంబీబీఎస్‌గానే పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు.

నిబంధనలు ఇవే..

ఆసుపత్రికి సంబంధించిన వైద్యుడి కలర్‌ ఫొటో, మెడికల్‌ కౌన్సిల్‌ ధ్రువపత్రాన్ని ప్రదర్శించాలి.

పర్యావరణ నిబంధనలు (ఈవీబీ), ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారనేది కార్మిక శాఖ నుంచి పొందిన రిజిస్ట్రేషన్‌ పత్రం ఉండాలి.

శస్త్ర చికిత్స థియేటర్లలో వాడే మత్తు మందుల వివరాలు రిజిస్టర్‌లో పొందుపర్చాలి.

ఓపీతో పాటు శస్త్ర చికిత్సకు సంబంధించి దేనికి ఎంత రుసుము వసూలు చేస్తున్నారనేది పట్టిక రూపంలో బహిరంగంగా ప్రదర్శించాలి.


నిఘా పెంచడంతో.. ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయించకుండా ఆసుపత్రుల నిర్వహణ చేపట్టడంతో అధికారులు నిఘా పెంచారు. ప్రతి ఆసుపత్రికి వెళ్లి అనుమతులు, ధ్రువపత్రాలు పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక బృందంతో సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణంలోని సుమారు 12 ఆసుపత్రుల నిర్వాహకులు పర్యావరణ, ప్రజారోగ్య శాఖలకు దరఖాస్తులు చేసుకున్నారంటే నిబంధనలు ఏ మేర పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘రిజిస్ట్రేషన్‌ చేయించుకోని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నాం. రోగుల నుంచి అధికంగా వసూళ్ల్లు చేస్తే చర్యలు తప్పవు. ఈ నెల 10న భీమవరంలోని రెండు ల్యాబుల్లో తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చాం’ అని డీఎంహెచ్‌వో మహేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని