logo

సస్పెన్షన్లంటే లెక్కే లేదు!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం ఇందుకు ఉదాహరణ.

Published : 28 Nov 2022 06:20 IST

కొందరు సబ్‌రిజిస్ట్రార్ల తీరిది


మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అక్రమాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారం ఇందుకు ఉదాహరణ. సాక్షాత్తు సబ్‌ కలెక్టర్‌ నిర్వహించిన తనిఖీల్లో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడగా.. అక్కడి సబ్‌రిజిస్ట్రార్‌ అంగీకరించడం సంచలనంగా మారింది. ఇలాంటి అక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ జరిగాయనే విషయమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. నిషిద్ధ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం, కార్యాలయాల్లో రికార్డులు తారుమారు చేయడం, నకిలీ చలానాల వ్యవహారం.. ఇలా చెబుతూ పోతే జిల్లాలో ఆ శాఖ లీలలకు లెక్కే లేదు. గత ఏడాది కాలంలో నలుగురు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెండ్‌ కావడమే ఇందుకు నిదర్శనం. అక్రమాలు, అవినీతి వ్యవహారాలు బయటపడిన సందర్భాల్లో బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయడంతో తమ పని పూర్తయిందన్నట్లుగా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సస్పెండైన వారు కొంతకాలం తర్వాత ఏదో ఒక విధంగా ఎక్కడో ఒకచోట విధుల్లో చేరిపోతున్నారు. మళ్లీ అటువంటి పనులకు పాల్పడుతున్నారు. మూలాలపై దృష్టి సారించకపోవడం, కఠినచర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ దాడులు, తనిఖీలు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో శాఖాపరంగా ఎక్కడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని కేసులు దీర్ఘకాలం పెండింగులో ఉండిపోతున్నాయి. కొంతకాలానికి అందరూ ఆ విషయాలను మర్చిపోతున్నారు.

కొన్ని ముఖ్య ఘటనలు ఇవీ

* నిషిద్ధ జాబితాలో ఉన్న కుమ్మరపురుగుపాలెంలోని ఒక అసైన్డ్‌ భూమికి సంబంధించి 16 దస్త్రాలను గతంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో అప్పటి మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

* నరసాపురం ప్రాంతంలో నిషిద్ధ భూమి వ్యవహారంలో కోర్టు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులున్నా రిజిస్ట్రేషన్‌ చేసిన అప్పటి ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండ్‌ అయ్యారు.

* ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద విలువైన భూమిని భీమవరం కార్యాలయంలో అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ ఘటనలో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు, ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యారు.

* ఆచంట ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేసిన మహిళా అధికారిణి నిబంధనలకు విరుద్ధంగా భీమవరం ప్రాంతానికి చెందిన భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో అప్పట్లో సస్పెండ్‌ అయ్యారు.

* కొవ్వూరులో 2.6 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో మార్కెట్‌ విలువను రూ.4.78 కోట్లకు గాను రూ.1.25 కోట్లకు తగ్గించిన వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన మహిళా అధికారిణి సస్పెండ్‌ అయ్యారు. ఆ సమయానికి ఆమె వేరేచోట పని చేస్తున్నారు.


నిబంధనలకు లోబడి పని చేయాలి

- సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌, భీమవరం

ఎవరైనా నిబంధనలకు లోబడి పని చేయాల్సిందే. వాటిని అతిక్రమించినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శాఖాపరంగా తనిఖీలు చేసి నివేదిక రూపొందించాం. దాన్ని డీఐజీకి పంపిస్తున్నాం. ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని