logo

చాపకింద నీరులా!

ఏలూరు జిల్లాలో 13.80 లక్షల పశు సంపద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులు పశువులపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పశువైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు..

Published : 28 Nov 2022 06:23 IST

పశువుల్లో వెలుగుచూస్తున్న ముద్దచర్మ వ్యాధి లక్షణాలు
ఆందోళనలో పెంపకందారులు

ఆవుకు సోకిన వ్యాధి

* ఏలూరు గ్రామీణ మండలం చొదిమెళ్ల గ్రామంలో ఉన్నట్టుండి పశువులకు జ్వరం సోకడం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, చర్మంపై బొబ్బలు తదితర లక్షణాలతో నీరసించిపోయి సరిగ్గా నడవలేకపోతున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేలోపే గ్రామంలో నాలుగు పశువులు చనిపోయాయి. మరో రెండు ఆవుల పరిస్థితి విషమంగా మారింది. వాటికి ముద్దచర్మ వ్యాధి (లంపీస్కిన్‌) లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


* ముదినేపల్లి మండలం గురజలో కొద్ది రోజుల కిందట పది ఆవుల్లో ముద్దచర్మ వ్యాధి లక్షణాలు కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాలో 13.80 లక్షల పశు సంపద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులు పశువులపై వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పశువైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు.. ముద్దచర్మ వ్యాధి గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు. దీనిపై పశు పోషకులకు సరైన అవగాహన లేదు. ఎక్కడైనా ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే అప్పుటికప్పుడు తూతూమంత్రంగా అవగాహన చర్యలు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

కీటకాల ద్వారా..

ముద్దచర్మ వ్యాధి కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది సోకిన పశువుల్లో గంటల వ్యవధిలోనే జ్వరం, చర్మం అంతటా బొబ్బలు ఏర్పడి మరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇది పాల ఉత్పత్తి సామర్థ్యాన్నీ దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఈ లక్షణాలున్న పశువులను కనీసం 15 రోజులు వేరుగా ఉంచాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటున్నారు.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

-డాక్టర్‌ నెహ్రూబాబు, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు

ఏలూరు గ్రామీణ మండలంలో కొన్ని పశువుల్లో ముద్దచర్మ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమయ్యాం. అనుమానిత పశువుల నమూనాలను సేకరించి నిర్ధరణ కోసం భోపాల్‌ పంపిస్తున్నాం. జిల్లాలో లక్షకు పైగా వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాం. పశువుల్లో టీకాలు వేసే ప్రక్రియను మరింత వేగం చేస్తాం. ఈ వ్యాధి గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనుషులకు సోకదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని