logo

పుస్తకాలిస్తే అక్రమాలు లెక్క కట్టేస్తారు!

పెనుగొండ మండలం ములపర్రులో ఒక డ్వాక్రా నాయకురాలి నిర్వాకం వల్ల సభ్యులు రూ.లక్షల్లో నష్టపోయారు.

Updated : 29 Nov 2022 06:25 IST

మండలాల్లో మొదలైన అతివల ఆడిటింగ్‌

పాలకొల్లు, న్యూస్‌టుడే

పద్దులు చూస్తున్న సామాజిక ఆడిటర్లు

*పెనుగొండ మండలం ములపర్రులో ఒక డ్వాక్రా నాయకురాలి నిర్వాకం వల్ల సభ్యులు రూ.లక్షల్లో నష్టపోయారు. ఎంతకీ అప్పు తీరకపోవడంతో గత నెలలో బ్యాంకు అధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించలేదని తేలింది. లబోదిబోమంటూ సదరు నాయకురాలిని నిలదీయగా నెలరోజుల్లో చెల్లిస్తానని చెప్పి చేతులెత్తేశారు. ఉమ్మడి జిల్లాలో ఇటువంటి అక్రమాలు మోసాలు డ్వాక్రా సంఘాల్లో అనేకం జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని అరికట్టడానికి సామాజిక ఆడిటర్లు అందుబాటులోకి వచ్చారు. ఆయా సంఘాల బ్యాంకు పుస్తకాలు ఇతరాత్ర వీరికిస్తే అక్రమాలను లెక్కకట్టేస్తారు. పొదుపు సంఘాల్లో పారదర్శకంగా సేవలు కొనసాగడానికి వీరు నడుంకట్టాల్సి ఉంది.

సగటున ఆరుగురు...

ఉమ్మడి జిల్లాలోని 48 మండలాల్లో పొదుపు సంఘాల్లో విద్యావంతులైన 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలను మండలానికి సగటున 6 నుంచి 8 మందిని సామాజిక ఆడిటర్లుగా నియమించి శిక్షణ ఇచ్చారు.   వీరు గ్రామాల వారీగా పొదుపు సంఘాల లెక్కలు తేలుస్తారు. మొదట ఐకేపీ నుంచి ఆయా సంఘాలకు అందుబాటులో ఉన్న సేవలను వివరిస్తారు. సందేహాలుంటే నివృత్తి చేస్తారు. అనంతరం సంఘాల పుస్తకాలను సమగ్రంగా పరిశీలించి వాటిలో ఉన్న లావాదేవీలను సభ్యులకు తెలియజేస్తారు. ఇలా చెప్పినప్పుడు సభ్యులకు ఏదైనా తెలియకుండా జరిగిన లావాదేవి ఉంటే బయటపడే అవకాశం ఉంటుంది.

చేసుకున్నోళ్లకు చేసుకున్నంత...

సంఘాలను ఆడిటింగ్‌ చేసినందుకు కొత్తసంఘాలకైతే ఒక్కో సంఘానికి రూ.250, పదేళ్లు పైబడిన సంఘాలకు రూ.350 చొప్పున ఆడిటర్లకు చెల్లించాల్సి ఉంది. కొన్నిచోట్ల ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారని తెలిసిన సెర్ఫ్‌ అధికారులు గ్రామ పరిధిలోని సంఘాలన్నీ గ్రామ సమాఖ్యకు ఆడిటింగ్‌ రుసుం చెల్లించాలని గ్రామ సమాఖ్య నుంచి ఒక చెక్కురూపంలో ఆడిటర్లకు అందించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలోను వెయ్యి నుంచి 1600 సంఘాల వరకు ఉన్నాయి. రోజుకు 4నుంచి 5 సంఘాలను ఆడిటింగ్‌ చేస్తే రూ.1000 నుంచి రూ.1250 వరకు కనీసం సంపాదించుకునే అవకాశం దక్కుతుంది. ఏటా వీరికి మూడు లేక నాలుగు నెలల పాటు ఉపాధి లభించనుంది. దీనిపై డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా జిల్లా మొత్తం మీద ఆడిటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని ఫలితాలు త్వరలో వస్తాయని చెప్పారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు