logo

పనులు గాలికొదిలేసి మట్టి అమ్ముకుంటున్నారు: దేవినేని

తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను నిలువునా దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.

Published : 29 Nov 2022 05:47 IST

విజయరాయిలో స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి, 
గన్ని వీరాంజనేయులు, చింతమనేని తదితరులు

చింతలపూడి, న్యూస్‌టుడే: తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను నిలువునా దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చింతలపూడిలో ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం కొమ్ముగూడెంలో రైతులతో  మాట్లాడారు. ఈ-క్రాప్‌ నమోదులో జరిగిన పొరపాట్ల కారణంగా రైతులు ఆర్బీకేకు వెళ్తే సవాలక్ష నిబంధనలు చెప్పి అవస్థలకు గురి చేస్తున్నారన్నారు. అనంతరం యర్రగుంటపల్లి, ఫాతిమాపురం గ్రామాల్లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా వారిని వైకాపా ప్రభుత్వం ఉసూరుమనిపిస్తుందన్నారు. పనులను గాలికొదిలేసి మట్టిని మాత్రం తవ్వుతూ దోచేస్తున్నారని విమర్శించారు.

సభకు స్థలం పరిశీలన

విజయరాయి(పెదవేగి), న్యూస్‌టుడే: పెదవేగి మండలం విజయరాయిలో ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సభా స్థలాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సోమవారం పరిశీలించారు. పుల్లారావు, ప్రభాకర్‌లు ద్విచక్ర వాహనంపై గ్రామంలో పర్యటించారు. ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చంద్రబాబు విజయరాయిలో ప్రారంభిస్తారని వారు తెలిపారు. వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని