logo

పేదల బియ్యం పక్కదారి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసే బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటుతోంది. ప్రతి నెలా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని మాఫియా వివిధ మార్గాల్లో సేకరించి రైస్‌ మిల్లులు, కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు.

Published : 02 Dec 2022 05:58 IST

ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రేషన్‌ బియ్యం

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసే బియ్యం గుట్టుచప్పుడు కాకుండా జిల్లా సరిహద్దులు దాటుతోంది. ప్రతి నెలా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని మాఫియా వివిధ మార్గాల్లో సేకరించి రైస్‌ మిల్లులు, కోళ్ల ఫారాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా షిప్పుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ ఎత్తున కాకినాడకు తరలివెళ్తోంది. పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని మాఫియా సభ్యులు వారికి అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో నిల్వ ఉంచి లారీల ద్వారా తెల్లవారు జామున తరలిస్తున్నారు. వెళ్లేదారిలో తనిఖీలున్నాయా లేదా పరిశీలించేందుకు ద్విచక్ర వాహనం, కార్లపై కొందరు వ్యక్తులు ముందు వెళ్తారు. వెనక రేషన్‌ బియ్యం వస్తుంది. ఈ వ్యవహారం అంతా అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఉమ్మడి జిల్లాలో 11,73,067 తెల్లకార్డు దారులు ఉన్నారు. ప్రభుత్వం అందించే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు 20,214 చౌక దుకాణాలు ఉన్నాయి. తెల్లకార్డుదారులకు ప్రతి నెలా సుమారు 17 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటిలో 60 శాతం బియ్యం పక్కదారి పడుతోంది. ప్రతి నెలా రేషన్‌ బండి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. రేషన్‌ బండి వచ్చి వెళ్లిన మరుసటి రోజు ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కొంత మంది ద్విచక్రవాహనాలపై వస్తుంటారు. కిలో రూ.10 నుంచి రూ.12 మధ్యలో కొనుగోలు చేసి వాటిని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని పిండి, బియ్యం నూకగా మార్చి దుకాణాలకు విక్రయిస్తున్నారు. కొంత మంది అతి తెలివిని ప్రదర్శించి రేషన్‌ బియ్యాన్ని బాగా పాలిస్‌ పెట్టి సోనా మసూరి బియ్యంలో కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం అంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

అధికారుల పాత్ర ఎంత..?..రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు అంతటా ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు బియ్యం మాఫియాతో చేతులు కలిపి అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించడం చర్చకు దారి తీసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో గతంలో పని చేసిన ఓ మహిళా అధికారి ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని బియ్యం అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టరు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. రైస్‌ మిల్లులు, డీలర్లు, డీలర్ల సంఘ నాయకులతో బృందం చర్చలు జరిపింది. చాలా మంది ఆ అధికారికి వ్యతిరేకంగా వివరాలు ఇచ్చినప్పటికీ శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఇక్కడి నుంచి వేరొక ప్రాంతానికి మాత్రం ఆ అధికారిని బదిలీ చేశారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి అక్రమాలు దర్జాగా జరిగిపోతున్నాయి.


18 టన్నులు స్వాధీనం

దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్టుగా ఉంది బియ్యం అక్రమణ రవాణా. విజయవాడ నుంచి కాకినాడకు ఐసర్‌ వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్‌ బియ్యాన్ని నల్లజర్ల పోలీసులు గత శనివారం రాత్రి పట్టుకున్నారు. పట్టుకున్న వ్యాన్‌ను పోలీసులు ఫౌర సరఫరాల అధికారులకు అప్పగించారు. ఇదే విధంగా పత్రి రోజు టన్నుల కొద్ది బియ్యం అడ్డదారుల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని