logo

నేటి నుంచి పెళ్లి సందడి!

డిసెంబరు వస్తూనే శుభ గడియలు తెచ్చింది. ఈ నెల 2న రాత్రి నుంచి మొదలుకానున్న ముహూర్తాలతో ఉమ్మడి జిల్లాలోని పలు జంటలు ఒక్కటి కానున్నాయి.

Published : 02 Dec 2022 06:03 IST

శుభకార్యాలకు వరుస ముహూర్తాలు

పాలకొల్లు, న్యూస్‌టుడే: డిసెంబరు వస్తూనే శుభ గడియలు తెచ్చింది. ఈ నెల 2న రాత్రి నుంచి మొదలుకానున్న ముహూర్తాలతో ఉమ్మడి జిల్లాలోని పలు జంటలు ఒక్కటి కానున్నాయి. అక్టోబరు చివరలో శుభకార్యాలకు కొంత విరామం రావడంతో దసరా, దీపావళి పండుగల అనంతరం వచ్చిన కార్తికమాసంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ప్రస్తుతం మళ్లీ వివాహాలకు వేళ కావడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లోనూ సందడి నెలకొంది.


ఇవిగో ముహూర్తాలు..

ఈ నెల 2న రాత్రి మొదటి ముహూర్తం ఉండగా 3, 4, 5, 6, 7, 8 తేదీల్లోనూ పెళ్లి ముహూర్తాలు వరుసగా ఉన్నాయి. ఈ నెల 11, 12 తేదీలు గృహ ప్రవేశాలకు అనువుగా వచ్చాయి. వీటి తర్వాత 14, 16, 17, 18 వరకు  వరుసగా వివాహ ముహూర్తాలున్నాయని, తర్వాత వచ్చే ఏడాది జనవరి 23న మాఘ మాసం వచ్చేవరకు మళ్లీ లేవని యలమంచిలి మండలం శిరగాలపల్లికి చెందిన పురోహితుడు గుత్తిన నరసింహమూర్తి (బాబ్జి) తెలిపారు.


కల్యాణ మండపాలు కిటకిట

వరుస ముహూర్తాలుండటంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 450 వరకు ఉన్న కల్యాణ మండపాలు ముందుగానే బుక్‌ అయ్యాయి. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని తరుణంలో 90 శాతం పెళ్లిళ్లు కల్యాణ మండపాల్లోనే చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇతరత్రా అవకాశం లేనివారు పుణ్యక్షేత్రాల్లో జరుపుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.


మంచి గిరాకీ

శుభ ముహూర్తాలున్నాయంటేనే మార్కెట్లో అన్నింటికీ గిరాకీ ఏర్పడుతుంటుంది. దానికితోడు ఈ ఏడాది మాలధారణ చేసినవారు ఎక్కువగా ఉండటంతో పూలు, పండ్ల నుంచి కూరగాయల, కిరాణా దుకాణాలు కళకళలాడనున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ముగిసిన వారం రోజుల్లోనే ఈ నెల 25న క్రిస్మస్‌, అనంతరం నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ వస్తుండటంతో ఉమ్మడి జిల్లా మొత్తం పెద్దఎత్తున సందడి వాతావరణం నెలకొంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వంట, విద్యుత్తు పనులు, అలంకరణలు, చేతివృత్తుల వారికి ఈ సీజన్‌ అంతా చేతినిండా పనేనని పేర్కొంటున్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని