logo

కోరుకొల్లు సర్పంచిపై సస్పెన్షన్‌ వేటు

కోరుకొల్లు సర్పంచి బట్టు లీలాకనకదుర్గపై మూడు నెలల సస్పెన్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 05 Dec 2022 05:07 IST

ఇన్‌ఛార్జిగా ఉప సర్పంచి నాగరాజుకు బాధ్యతలు

లీలాకనకదుర్గ, సర్పంచి

కలిదిండి, న్యూస్‌టుడే: కోరుకొల్లు సర్పంచి బట్టు లీలాకనకదుర్గపై మూడు నెలల సస్పెన్షన్‌ విధిస్తూ కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రతులను గ్రామ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌ ఆదివారం సర్పంచికి అందజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడం, అధికార దుర్వినియోగం, ఆర్థిక పరమైన లోపాల నేపథ్యంలో ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో వివరణ కోరుతూ సర్పంచికి ఇటీవల నోటీసులు జారీ అయ్యాయి. ‘అవన్నీ శాఖాపరమైన తప్పిదాలేనని, పరిపాలనా పరమైనవి కాదంటూ’ సర్పంచి ఇచ్చిన వివరణపై కలెక్టర్‌ సంతృప్తి చెందలేదు. పంచాయతీ పరిపాలనలో కార్యదర్శులను సమన్వయపర్చుకుంటూ పాలన చేయాల్సిన బాధ్యత సర్పంచిపై ఉన్నందున ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం లీలాకనకదుర్గను సర్పంచి పదవి నుంచి మూడు నెలలు సస్పెండు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఉప సర్పంచి నాగరాజును ఇన్‌ఛార్జి సర్పంచిగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇకపై జారీచేసే అన్ని చెక్కులపై ఇన్‌ఛార్జి సర్పంచితో పాటు ఈవోపీఆర్డీ కౌంటర్‌ సంతకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కైకలూరు సబ్‌ట్రెజరీ అధికారికి సూచించారు. ఈ మేరకు నాగరాజు ఆదివారం ఇన్‌ఛార్జి సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు.

న్యాయ పోరాటానికి సిద్ధం.. చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వాటిని సస్పెండు చేస్తూ న్యాయమూర్తి ఈ నెల 2న ఆదేశాలు జారీ చేసినట్లు సర్పంచి బట్టు లీలాకనకదుర్గ ఆదివారం తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తనను సస్పెండ్‌ చేయడం సరికాదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని