logo

నేలతల్లి.. తల్లడిల్లి

కాలుష్య కారకాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతుండటంతో పుడమి తల్లి విలవిల్లాడుతోంది.

Updated : 05 Dec 2022 05:26 IST

కాలుష్య కారకాలతో భూమి నిస్సారం
ఉండి, భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే

సీసలిలో ఫ్యాక్టరీ కాలుష్యంతో దెబ్బతిన్న వరి చేను

కాలుష్య కారకాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతుండటంతో పుడమి తల్లి విలవిల్లాడుతోంది. అవసరాలకు అనుగుణంగా పంట దిగుబడులు పెంచడమే లక్ష్యంగా రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో భూమి సహజ స్వభావాన్ని కోల్పోయి నిస్సారంగా మారుతోంది. జల కాలుష్యంతో చౌడు, ఉరక భూముల సమస్య పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పుతెచ్చి భూసార పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించే కార్యక్రమాలు చేపట్టాలని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్సెస్‌ (ఐయూఎస్‌ఎస్‌) 2002లో సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఏటా డిసెంబరు ఐదున మృత్తికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నేలల పరిస్థితిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.

కారణాలు ఇవి..

* పరిశ్రమల నుంచి వ్యర్థాలను జలవనరుల్లోకి వదిలేయడం. * సాగులో ఎరువులు, పురుగు, కలుపు మందుల వినియోగం పెరిగిపోవడం * నీరు ఒకేచోట నిల్వ ఉండటం * వరదలు, భారీ వర్షాల సమయంలో భూమి పైపొర కొట్టుకుపోవడం * యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడంతో నత్రజని, ఇనుము, జింకు, గంధకం, మాంగనీసు, బోరాన్‌ వంటి సూక్ష్మపోషకాల లోపాలు పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

పురుగు మందు పిచికారీ

మన నేల ఇలా..

ఉమ్మడి జిల్లాలో నేల స్వరూపం విభిన్నం. మెట్టలో ఎర్రనేలలు, డెల్టాలో నల్లరేగడి, ఇసుక నేలలు విస్తరించి ఉన్నాయి. శాతాల్లో వివరాలు ఇలా..
ఎర్రనేలలు- 33
ఇసుక-  30
నల్లరేగడి-  24
ఇతర నేలలు- 13

చిన్న కమతాలే ఎక్కువ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 48 మండలాల్లో 11,65,680 ఎకరాల భూమి సాగులో ఉంది. చిన్న, సన్నకారు రైతుల చేతుల్లోనే 7,38,636 ఎకరాల విస్తీర్ణం ఉంది. ప్రధాన పంట వరి. తర్వాత ఆక్వా (చేపలు, రొయ్యల) చెరువులున్నాయి. చెరకు, ఆయిల్‌పామ్‌, కోకో, అరటి, కొబ్బరి, మొక్కజొన్న, పొగాకు, కూరగాయలు, వివిధ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వరి సాగయ్యే  విస్తీర్ణం రాన్రానూ తగ్గిపోతోంది. నేల కాలుష్యం కూడా దీనికి ఓ కారణం.

చౌడు తగ్గాలంటే..

ఆక్వా చెరువుల్లో వ్యర్థ జలాలను యథేచ్ఛగా కాలువల్లోకి వదిలేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో చౌడు, ఉరకభూముల సమస్య పెరుగుతోంది. ఈ తరహా సమస్య ఉన్న భూమిలో పైపొరను చెక్కి తీసేయాలి. తర్వాత చిన్న మడులుగా మార్చుకొని 15 సెంటీమీటర్ల లోతున నీరు పెట్టి నాలుగైదు రోజులు ఉంచి తీసేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే ఆ భూముల్లో చౌడు సాంద్రత చాలావరకు తగ్గుతుంది. వేసవిలో జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పెంచి భూమిలో కలియదున్నితే చౌడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

ఎంవీ కృష్ణాజీ, విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధన స్థానం, మార్టేరు

సేంద్రియ సేద్యమే రక్ష

భూసారం స్థిరంగా ఉండాలంటే సేంద్రియ సేద్యమే మార్గం. సేంద్రియ ఎరువుల వినియోగంతో నేల గుల్లబారి తేమ నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. సాగుకు ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. భూ ఆరోగ్య ఫలితాల ఆధారంగా నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఎరువులు చల్లుకోవాలి. మురుగు నీటిపారుదల సౌకర్యాన్ని సరైన రీతిలో ఏర్పాటుచేసుకోవాలి.

ఎన్‌.మల్లికార్జునరావు, సమన్వయకర్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని