logo

ప్రతిభ బోలెడు.. ప్రోత్సాహం మూరెడు

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ (శాప్‌) నైపుణ్య భాగస్వామ్యంతో పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో బాలికలకు క్రీడా పాఠశాలను ప్రారంభించారు.

Published : 05 Dec 2022 05:07 IST

పోలసానిపల్లి క్రీడా పాఠశాల దుస్థితి

కనీస సదుపాయాలు లేని మైదానం

భీమడోలు, న్యూస్‌టుడే: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ (శాప్‌) నైపుణ్య భాగస్వామ్యంతో పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో బాలికలకు క్రీడా పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లోని క్రీడా ప్రతిభ కలిగిన గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఆరంభం బాగానే ఉన్నా వసతులు కల్పించడంలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.

వసతులు కరవు.. క్రీడా పాఠశాలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 34 మంది బాలికలున్నారు. ప్రస్తుతం ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. పూర్తి స్థాయిలో శిక్షకులు లేకపోవడంతో ఇతర అంశాల్లో నైపుణ్యాలు సాధించలేకపోతున్నారు. సువిశాల మైదానం ఉన్నా కనీస వసతులు, సాధన చేసేందుకు ఉపకరణాలు లేవు. పరుగు పందెంలో పాల్గొనే వారికి బూట్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పౌష్టికాహారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నైపుణ్యానికి కొదవ లేదు.. పాఠశాలలో ప్రతిభ కలిగిన క్రీడాకారిణులకు కొదవలేదు. వసతులు లేకున్నా శిక్షకురాలు కృష్ణకుమారి పర్యవేక్షణలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జూన్లో జాతీయ స్థాయిలో గువాహటిలో జరిగిన సౌత్‌జోన్‌ పోటీల్లో జె.మోహిని డిస్క్‌/షాట్‌ విభాగంలో బంగారు పతకం సాధించింది. కంబైన్డ్‌ ఈవెంట్స్‌ (హెక్సాథ్లాన్‌) పోటీల్లో దేశస్థాయిలో 16వ స్థానం పొందింది. కె.పూజ రేస్‌ వాకింగ్‌(3 కిలోమీటర్లు)లో 20వ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన వారూ ఉన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై ఏలూరు జిల్లా గురుకుల పాఠశాలల సమన్వయకర్త పి.వాసవి మాట్లాడుతూ వసతులు, క్రీడాకారులకు అదనపు పౌష్టికాహారం అందించే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు