logo

విద్యుత్తు లేక.. పనులు సాగక

జంగారెడ్డిగూడెం జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తికాక లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 05 Dec 2022 05:07 IST

నీళ్లు కొనుక్కుంటున్న లబ్ధిదారులు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

కొనుగోలు చేసిన నీటితో ఎల్‌-2లో నిర్మాణ పనులు

జంగారెడ్డిగూడెం జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు పూర్తికాక లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడి ఎల్‌-2, 3 లేఅవుట్లలో లైన్ల నిర్మాణం నిమిత్తం సరఫరా నిలిపేశారు. ప్రస్తుతం కండక్టర్ల నిర్మాణంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చాల్సి ఉంది. ఈ కారణంగా నీళ్లు లేక గృహ నిర్మాణ లబ్ధిదారులు, ఆ పనులు చేసేందుకు ఒప్పందం చేసుకున్న మేస్త్రీలు నానా అవస్థలు పడుతున్నారు. చేసేది లేక కొందరు ఒక్కో నీటి ట్యాంకర్‌ను రూ.1000 నుంచి రూ.1200 పెట్టి కొనుగోలు చేసి పనులు చేస్తున్నారు. పురపాలక సంఘం సరఫరా చేసే నీరు అరకొరగా అందుతోంది.

నీటి ఖర్చు రూ.8 వేలు.. ‘రెండు నెలలుగా విద్యుత్తు సరఫరా లేక మోటార్లు తిరగడం లేదు. మా అమ్మ నాగిని పేరున ఇల్లు మంజూరైంది. నీటిని కొనుక్కొని కట్టుకుంటున్నాం. ఆయా ట్యాంకర్లకు ఇప్పటివరకు రూ.8 వేలు ఖర్చయింది. అయినా పూర్తిగా తడపనందున ఇంటి గోడలు బీటలు వారుతున్నాయి. చేసేది లేక ప్లాస్టింగ్‌ చేయించాం. వృత్తిరీత్యా నేను తాపీ పనిచేస్తా. మున్సిపల్‌ ట్యాంకర్‌ వస్తున్నా సరిపోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం’ అని షేక్‌ జానీ తెలిపారు. 

ఆగిన నిర్మాణాల్లో మొలిచిన మొక్కలు

పీపా రూ.100..

‘మేము కట్టుకుంటున్న ఇంటి పక్కన పొలం ఉంది. అందులో నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. అయినప్పటికీ పునాదుల వరకు రెండు ట్యాంకర్ల నీరు కొన్నా. మరీ అవసరమైతే పీపాకు రూ.100 ఇచ్చి కొంటున్నాం. పొలాల పక్కనుందని మున్సిపల్‌ సిబ్బంది మాకు ట్యాంకర్‌ నీరు ఇవ్వడం లేదు’ అని కె.ఉదయ్‌ గణేష్‌ చెప్పారు.

కొనుక్కొని కడుతున్నా

‘నేను నాలుగు ఇళ్లు కట్టడానికి ఒప్పందం చేసుకున్నా. రెండు నెలలుగా నీరు, కరెంటు లేదు. ట్యాంకర్‌కు రూ.800 చొప్పున చెల్లించి కొనుగోలు చేసి కడుతున్నాం. నాలుగు ఇళ్లకు కలిపి రోజూ ఒక ట్యాంకరు కొంటున్నా’ అని తాపీమేస్త్రీ శివ పేర్కొన్నారు. ‘రెండు లే అవుట్లలో ప్రస్తుతం లైన్ల నిర్మాణం జరుగుతున్నందున ఇబ్బంది ఉండొచ్చు’ అని విద్యుత్తు ఈఈ అంబేడ్కర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని