logo

మా ఊరి బస్సు విజయవాడకెళ్లింది

విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

Published : 08 Dec 2022 08:34 IST

జయహో బీసీ సభకు తరలిన వైనం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల ఇక్కట్లు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే, కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, జంగారెడ్డిగూడెం, నూజివీడు

ఏలూరులో పడిగాపులు

విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గంటల తరబడి బస్సుల కోసం వేచి చూశారు. ఓపిక లేక   చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇందులో పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అదనంగా వసూలు చేశారు.

సాయంత్రం 6గంటలకు ఏలూరు బస్టాండులో నిరీక్షిస్తూ..

జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు.. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం, రావులపాలెం, రాజమహేంద్రవరం, ద్వారకాతిరుమల, చింతలపూడి, మచిలీపట్నం, నూజివీడు ఇలా చాలా మార్గాలకు పల్లె వెలుగు బస్సుల్లోనే అధిక శాతం ప్రయాణికులు వెళుతుంటారు. సభకు వెళ్లిన బస్సులల్లో ఇవే 90 శాతం ఉంటాయి. దీంతో సాధారణ ప్రయాణికులు, ఫాస్ట్‌ సర్వీస్‌ బస్సులు లేని గ్రామాల ప్రజలు అవస్థలు పడ్డారు. భీమవరం నుంచి రాజమహేంద్రవరానికి ప్రతి ఇరవై నిమిషాలకి ఒక సర్వీసు ఉంటుంది. బుధవారం గంటన్నరైనా బస్సు లేకుండా పోయింది. రాజమహేంద్రవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర మార్గాలతో పాటు ఇతర మార్గాల్లోనూ బస్సులు లేకుండా పోయాయి. పాలకొల్లు బస్టాండ్‌కు వచ్చే రాజమహేంద్రవరం బస్సులు 5, ఏలూరుకు వెళ్లే 3 బస్సులు సభకు వెళ్లడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికుల బస్సులే లేవు. ఇదే అదనుగా ఆటోవాలాలు అధికంగా వసూలు చేశారు. బీ ఉదయం నుంచి రాత్రి వరకు జంగారెడ్డిగూడెం డిపో నుంచి పోలవరం 14 సర్వీసులు నడపాల్సి ఉండగా వాటిని ఏడుకు పరిమితం చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆ మార్గంలో ప్రత్యామ్నాయ డిపో బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించారు. బీ కొయ్యలగూడెం మీదుగా తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం వెళ్లే బస్సులు తక్కువగా ఉన్నాయని కొయ్యలగూడెం బస్టాండులో ప్రయాణికులు వాపోయారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పెద్దసంఖ్యలో పడిగాపులు కాస్తూ కనిపించారు.

ప్రతి డిపో నుంచి తరలింపు.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు డిపోలుండగా అన్నింటి నుంచీ మొత్తం 136 బస్సులను మళ్లించారు. అత్యధికంగా తణుకు నుంచి 24 బస్సులను తరలించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఏలూరు డిపోల నుంచి వరుసగా 21,21, 19, 16 బస్సులను మళ్లించారు.

జంగారెడ్డిగూడెంలో..

పెళ్ళిళ్లకు లేవు.. బుధవారం పెళ్లిళ్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, బస్సులు డిపోలో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఫలితం లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్లారు. వారం నుంచి పెళ్లిళ్లకు బస్సులు ఇవ్వలేదు. ఇస్తే ఈ సమావేశానికి పంపేందుకు కొరత ఉంటుందని నిరాకరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని