logo

చేపా చేపా ఎంత తెస్తావ్‌!

ఫిష్‌ఆంధ్రా పేరిట చేపల విందు చేసేందుకు సర్కారు   కసరత్తు చేస్తోంది. దీని కోసం బీఎఫ్‌ఎఫ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది.

Published : 08 Dec 2022 04:34 IST

ఆహార విక్రయశాలల ఏర్పాటుకు కసరత్తు

పాలకొల్లు, న్యూస్‌టుడే: ఫిష్‌ఆంధ్రా పేరిట చేపల విందు చేసేందుకు సర్కారు   కసరత్తు చేస్తోంది. దీని కోసం బీఎఫ్‌ఎఫ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 20 నుంచి 30 ఆహారశాలలు(రెస్టారెంట్లు) ఏర్పాటు చేయాలని మత్స్యశాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలిప్పించి కొత్త ఏడాది నాటికి చేపల రుచులు పంచాలని అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఉభయతారకంగా.. ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రంలో ఏడాదికి వాటి తలసరి వినియోగం 8 కిలోలు మాత్రమే.  ఉత్తర భారతదేశంలో ఇది 40 కిలోలకు పైగా ఉంది. దీని ప్రభావం ఇటు మార్కెట్‌పైనా, తర్వాత ప్రజారోగ్యం మీద ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చేపలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయనేది జనమెరిగిన సత్యం. అందువల్ల వాటితో తయారు చేసిన ఆహారం అందుబాటులోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. ప్రస్తుతం ఆక్వా రైతుల ఉత్పత్తులకు తగిన ఎగుమతులు లేక ఆదాయం క్షీణించి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఉత్పత్తులకు  స్థానికంగా గిరాకీ తీసుకు రావాలన్నది మరో ఆలోచన. ఈ రెండింటిని కలగలిపి ఉభయతారకంగా చేపల ఆహారశాలలను తెరమీదికి తెచ్చారు. వీటిలో చేపలతోపాటు రొయ్యలు, పీతలు కూడా అందుబాటులో ఉంచుతారు. ఉన్న రకాలతోపాటు ఏ చేపలో ఏఏ పోషకాలు ఉంటాయనే జాబితాను మెనూలా అందుబాటులో ఉంచాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

రుణాలిలా.. నిరుద్యోగ యువతతోపాటు ఆహారశాలల ఏర్పాటుకు అభిరుచి ఉన్నవారికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంకు రుణాలివ్వాలని ప్రతిపాదించారు. దీనిలో 40శాతం రాయితీ అన్ని వర్గాలకు ఉంటుంది. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60శాతం రాయితీ లభించనుంది. రూ.10 లక్షలతో ఏర్పాటుచేసే ఆహారశాలను నిత్యరుచులు(డైలీ డెలీషియస్‌), రూ.20 లక్షలతో రానున్న ఆహారశాలకు సూపర్‌ అని, ఆపై లాంజ్‌ పేరిట పైఅంతస్తు నమూనాలో వీటిని నిర్మించనున్నారు. సూక్ష్మవంటశాలలు(స్మార్ట్‌ కిచెన్లు) వీటిలో అందుబాటులో ఉంటాయి.

వేడిగా వడ్డించేలా..  చేప అంటే కేవలం కూరలేగాక చేపల పకోడి, ఫ్రై, పిజ్జా, బర్గర్లు, స్నాక్స్‌, రొయ్య టిక్కాలు ఇతరత్రా ఆహారం అందుబాటులో ఉంచుతారు. వేడిగా వేగంగా ఆహారాన్ని అందించడంతోపాటు సరసమైన ధరలకు విక్రయించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.


పోషకాలు అందించేందుకే..  ప్రజల ఆరోగ్యం పెంపొందించడంతోపాటు ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా గిరాకీ పెంచడానికి చేపల ఆహారశాలలు ఉపయోగపడతాయి. పోషకాహారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరుకు పాలకొల్లులో రెండింటిని ప్రారంభించబోతున్నాం.

ఎల్‌.ఎల్‌.ఎన్‌.రాజు, మత్స్యశాఖ ఉపసంచాలకుడు, భీమవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని