logo

చేతికందిన పంట.. అమ్మేందుకు తంటా!

ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతుండటంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Dec 2022 04:34 IST

గుమ్ములూరులో బరకాలు కప్పి భద్రపరిచిన ధాన్యం రాశులు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతుండటంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతంలో వ్యత్యాసాలు, తూకంలో ఇబ్బందులు, వెంటాడుతున్న సర్వర్‌ సమస్యలతో ప్రతిచోటా గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ట్రాక్టర్‌ను తెస్తే సాయంత్రానికి కూడా దిగుమతి కాని పరిస్థితులు నెలకొనడంతో ధాన్యం రవాణాకు వాహనాలను పంపడం లేదని రైతులు వాపోతున్నారు. ఆకివీడు మండలం అజ్జమూరులో సహకార సంఘం వేబ్రిడ్జి వద్దకు బుధవారం లోడుతో వచ్చిన ట్రాకర్లు సర్వర్‌ ఇబ్బందుల కారణంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గంటల తరబడి నిలిపివేయడంతో అక్కడ రైతులు పడిగాపులు కాశారు.

అజ్జమూరు వేబ్రిడ్జి వద్ద ధాన్యం లోడు ట్రాక్టర్లు

తేమశాతం, తూకంలో తేడాల వల్ల గందరగోళ పరిస్థితి తలెత్తుతుందని, ధాన్యం విక్రయించే సమయంలో అన్ని దశల్లోనూ గంటల తరబడి జాప్యం జరుగుతోందని వారు చెప్పారు. తొలుత తేమశాతం పరిశీలించి 16.1 ఉంది పట్టేయండని సిబ్బంది చెప్పారని.. తీరా రైస్‌మిల్లుకు లోడు తీసుకెళ్లాక తేమశాతం 17.6 వచ్చిందంటున్నారని ఆకివీడుకు చెందిన కౌలు రైతు అప్పలనాయుడు వాపోయారు. తేమశాతం పేరిట తూకంలో తరుగు రాస్తామని రైస్‌మిల్లు వద్ద ఇబ్బందిపెడుతున్నారని మాదివాడకు చెందిన రైతు పులగం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క తుపాను హెచ్చరికల నేపథ్యంలో అరబోసిన, రాశుల్లో ఉన్న ధాన్యాన్ని భద్రపరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వీలైనంత త్వరగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని