logo

ఇక కొనలేం!

‘ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేశాం. ఇంకా కొనలేం..  మీరు బయట ఎవరికైనా అమ్ముకోండి’ ఇది జిల్లా వ్యాప్తంగా చాలా రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు చెబుతున్న మాట.

Updated : 10 Dec 2022 04:19 IST

లక్ష్యం పూర్తయిందంటూ చేతులెత్తేస్తున్న ఆర్బీకే సిబ్బంది
వెనక్కి  పంపిస్తున్న వైనం
భయపెడుతున్న వరుణుడు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

ఈ చిత్రం చూస్తుంటే.. రైతులు ధాన్యం అమ్మేసిన తర్వాత హడావుడిగా పోగు చేస్తున్నట్లు ఉంది కదా..వాస్తవ పరిస్థితి వేరు. వీరంతా నిడమర్రుకు చెందిన రైతులు. ధాన్యం విక్రయం కోసం రెండు రోజులు అడవికొలను రైతు భరోసా కేంద్రాల చుట్టూ సంచుల కోసం తిరిగారు. సిబ్బంది కొనుగోలు లక్ష్యం పూర్తయిందని కొనలేమని చెప్పారు. ఇంతలో శుక్రవారం వర్షం మొదలుకావటంతో చినుకుల్లోనే ధాన్యం ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇలా అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రైతులది ఇదే పరిస్థితి.

‘ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేశాం. ఇంకా కొనలేం..  మీరు బయట ఎవరికైనా అమ్ముకోండి’ ఇది జిల్లా వ్యాప్తంగా చాలా రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు చెబుతున్న మాట. ఒకవైపు కల్లాల్లో ధాన్యం.. మరో వైపు భయపెడుతున్న వాతావరణంతో అన్నదాత వెన్నులో వణుకు    పుడుతోంది. కల్లాల్లో ధాన్యానికి బరకాలు కప్పుకొని ఎవరు కొంటారా అని కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు.

* నిడమర్రు మండలం అడవికొలనులో రెండు రైతుభరోసా కేంద్రాలున్నాయి. 1వ కేంద్రానికి 1500, రెండో కేంద్రానికి 1100 మెట్రిక్‌ టన్నుల లక్ష్యం నిర్దేశించారు. ఇది ఇప్పటికే పూర్తి కావటంతో కొనుగోలు చేయటం లేదు. ఎంత మంది వచ్చి అడిగినా మా లక్ష్యం పూర్తయిందని చెబుతున్నారు. ఈ రెండు కేంద్రాల పరిధిలో ఇంకా 500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే కల్లాల్లో ఉంది.   వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

నిర్లక్ష్యం చేస్తున్నారు: ‘రైతులకు గిట్టుబాటు ధర అందిస్తాం..దళారుల ప్రమేయం లేకుండా విక్రయాలు చేయిస్తాం’ అంటూ అధికారులు, నాయకులు ప్రసంగాల్లో ఊదరకొడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు   భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో కొనుగోలు లక్ష్యం 3 లక్షల మెట్రిక్‌ టన్నుల కాగా ఇప్పటి వరకూ లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా 2 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనాల్సి ఉంది. ఏటా జిల్లాలో లక్ష్యం నిర్దేశించుకునే వారు.. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల వారీగా లక్ష్యం నిర్దేశించారు. ఈ లక్ష్యం కంటే క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యం చాలా ఎక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొవ్వలి, నారాయణపురం, పోతునూరు, నిడమర్రు తదితర ప్రాంతాల్లో రైతుభరోసా కేంద్రాల్లో లక్ష్యం పూర్తి కావటంతో ధాన్యం కొనటం లేదు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సమస్య మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది.

లక్ష్యం పెంచినా ఇబ్బందే: కొవ్వలిలో గత నాలుగు రోజులుగా ధాన్యం కొనక రైతులు  అవస్థలు పడ్డారు.  అధికారుల చుట్టూ తిరిగితే ఆ రోజు లక్ష్యం కొంత పెంచారు. ఇది జిల్లా లక్ష్యం కాదు. ఆర్బీకేల్లో  మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో రైతులకు ఉపశమనం లభించినా మరో చోట ఇదే సమస్య వస్తుంది. జిల్లా లక్ష్యం పెంచితే ఆ మేరకు అన్ని ఆర్బీకేల్లో  పెరుగుతుంది.ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.


వట్లూరులో హడావుడిగా పనలను కుప్పలుగా పెడుతూ

వర్షంతో వణుకు: జిల్లావ్యాప్తంగా శుక్రవారం జల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. ఒక వైపు ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోలేక అగచాట్లు పడ్డారు. ఇప్పటి వరకూ ఆరిన ధాన్యానికి ఈ వర్షానికి మళ్లీ తేమ పెరుగుతుందనే భయంతో బరకాల కప్పుకుని తిండీతిప్పలు లేకుండా కాపలా కాస్తున్నారు.


నేను సాగు చేస్తున్న ఎకరంలో ధాన్యం అమ్మేందుకు ఆర్బీకేకి వెళితే సిబ్బంది లక్ష్యం పూర్తి అయిందని చెబుతున్నారు. సంచులు ఇవ్వటం కుదరదన్నారు. వర్షం పడటంతో బరకాలు కప్పినా తేమశాతం పెరిగితే ధాన్యం ఎవరు కొంటారు. ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

పైడికొండల శివాజీ, రైతు, అడవి కొలను  


నాలుగెకరాల్లో కౌలు సాగు చేశాను. ధాన్యం నూర్పిడి చేసి రెండు వారాలవుతోంది. సంచుల కోసం అడవికొలను ఆర్బీకేకి వెళితే ఇప్పటికే లక్ష్యం పూర్తయిందని కొనుగోలు చేయటం కుదరదని చెబుతున్నారు. వర్షం నుంచి కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాను. ఒక్కో బరకాకు రోజుకు రూ.20 అద్దె కట్టాలి. ఇప్పుడు ధాన్యం ఎవరికి అమ్మాలి.

పి.భోగేశ్వరరావు, కౌలు రైతు అడవికొలను


లక్ష్యం ప్రకారమే కొంటాం

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తాం. ఎక్కువ ఉంటే రైతులు ఎవరికైనా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారమే అమ్ముకోవచ్చు. రైతుభరోసా కేంద్రాల్లో ఇబ్బంది ఉంటే పక్కన కేంద్రాల్లో సర్దుబాటు చేస్తాం. కానీ జిల్లా లక్ష్యం మాత్రం మార్పు చేసే అవకాశం లేదు.

అరుణ్‌బాబు, జేసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని