logo

చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

నరసాపురంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకొని సుమారు రూ.పది లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ యు.రవిప్రకాశ్‌ తెలిపారు.

Published : 20 Jan 2023 05:19 IST

రూ.10 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాశ్‌  

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకొని సుమారు రూ.పది లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ యు.రవిప్రకాశ్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నరసాపురం పట్టణం పదో వార్డులో నివాసం ఉంటున్న న్యాయవాది కొప్పర్తి వెంకటరత్నం ఇంట్లో దొంగలు ఈ నెల 15వ తేదీ రాత్రి చోరీ చేశారు. బీరువాలోని రూ.7.50 లక్షల నగదు, సుమారు ఆరుకాసుల బంగారు ఆభరణాలు, 81 గ్రాముల వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణకు డీఎస్పీ కె.రవిమనోహరచారి, భీమవరం క్రైం ఇన్‌స్పెక్టర్‌ ఆకుల రఘు, నరసాపురం సీఐ శ్రీనివాసయాదవ్‌, ఎస్సైలు కె.సుధాకరరెడ్డి, ఎఫ్‌.రెహమాన్‌లతో రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కేసు విచారణలో భాగంగా పాత నేరస్థులకు సంబంధించి నూతనంగా నమోదైన కేసులను పరిశీలించగా రుస్తుంబాదకు చెందిన కొత్తపల్లి నరేష్‌(34) పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతని ఆచూకీ కోసం గాలిస్తుండగా నరేష్‌తో పాటు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు పంచాయతీ మాసాయిపేటకు చెందిన బీరా రమేష్‌(34), నరసాపురం 27వ వార్డుకు చెందిన గుబ్బల భాస్కర్‌(34) అనే ఇద్దరు వ్యక్తులతో అతని ఇంటివద్దే ఉన్నారు. వారి అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. వారివద్ద నుంచి చోరీ సొత్తులో రూ.7.30 లక్షలు, 5.2 కాసుల బంగారు ఆభరణాలు, 81 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విచారణాధికారులకు ప్రశంసాపత్రాలతోపాటు నగదు రివార్డును ఎస్పీ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని