logo

పొలంబడి..తడబడి!

వైఎస్‌ఆర్‌ పొలంబడి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. అన్నదాతలకు సాగులో మెలకువలు తెలిపేందుకు ప్రభుత్వం రూ.లక్షలు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది.

Published : 25 Jan 2023 05:26 IST

నామమాత్రంగా నిర్వహణ

పోణంగిలో కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ పొలంబడి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు. అన్నదాతలకు సాగులో మెలకువలు తెలిపేందుకు ప్రభుత్వం రూ.లక్షలు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శ వినిపిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో పొలంబడి కార్యక్రమం కింద 2020-21 లో రూ.27 లక్షలు విలువైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2021- 22లో రూ.34.28 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు. 2021 ఖరీఫ్‌నకు సంబంధించి వరిలో 536, పత్తి 24, అపరాలు 5, వేరుశనగలో మూడు పొలంబడులు నిర్వహించారు. 2022 రబీకి సంబంధించి వరిలో 432, మొక్కజొన్న 105, అపరాలు 30, వేరుశనగలో ఏడు నిర్వహించారు. ప్రభుత్వం ఒక్కో పొలంబడికి రూ.10,900 కేటాయించగా.. 2022-23 నుంచి రూ.20,514 కేటాయిస్తోంది.

జిల్లాల పునర్విభజన తర్వాత 2022 ఖరీఫ్‌నకు సంబంధించి ఏలూరు జిల్లాలో వరి 345, మొక్కజొన్న 4, వేరుశనగ 2, అపరాలు 8, పత్తిలో 16 పొలంబడి కార్యక్రమాలు నిర్వహించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత రబీలో వరిలో 107, మొక్కజొన్న 182, వేరుశనగ 10, అపరాల్లో 59 నిర్వహించాలనేది అధికారుల లక్ష్యం. అయితే అధికారులు చూపుతున్న లెక్కలు కాగితాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో నిర్వహించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొలంబడికి ముందు పంట ఎంపిక, సమావేశాల నిర్వహణ రైతుల వివరాల నమోదు వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. రైతులకు అల్పాహారం అందించాల్సి ఉంటుంది.


కనిపించని అవగాహన కార్యక్రమాలు

పంట కాలంలో శిక్షణ ఇచ్చి రైతులను నిపుణులుగా తీర్చిదిద్దడమే పొలంబడి లక్ష్యం. ఎంపిక చేసిన పొలాల్లో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు నిరంతర పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలించి అవసరమైన నిర్ణయాలపై వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పంటల్లోని వివిధ మార్పులను పరిశీలించి సమగ్ర యాజమాన్య పద్ధతుల అమలు, సస్యరక్షణ, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే పొలంబడులు సక్రమంగా, సమర్థంగా నిర్వహించిన దాఖలాలు లేవు.  నిబంధనలకు అనుగుణంగా ఆయా సీజన్లలో నిర్దేశించిన లక్ష్యం మేరకు పొలంబడులు నిర్వహిస్తున్నాం. అందుకు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తున్నాం’ అని జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ తెలిపారు.


భూసారాన్ని బట్టి విత్తన రకాలు సూచించాలి

ఉండి, న్యూస్‌టుడే:  భూసారాన్ని బట్టి అనువైన విత్తన రకాలను ముందుగానే సూచిస్తే అధిక దిగుబడి సాధించేందుకు అవకాశముంటుంది. సాగు ప్రారంభ దశలో ఈ రకమైన అవగాహన కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. పొలంబడి కార్యక్రమానికి నేను వెళ్తున్నా. మా ప్రాంతంలో 15-20 మందికి మించి రైతులు హాజరవడంలేదు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులతో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం రైతుల దరికి సకాలంలో చేరుతుందని నా అభిప్రాయం. వీఏఏలకు శాస్త్రీయ పరిజ్ఞానం తక్కువ. నాట్లేసిన నెలలోపు మూడు కోటాల ఎరువులు చల్లుకోవాల్సి ఉంది. వారం రోజులు నిరీక్షిస్తే కానీ కాంప్లెక్స్‌ ఎరువులు దొరకడం లేదు. పొలంబడిలో ఎంపిక చేసిన రైతులందరికీ విత్తనాలు, సేంద్రియ ఎరువులు, వ్యవసాయ పరికరాలను ఉచితంగా ప్రభుత్వమే అందించాలి.

పోలుబోతు రాము, రైతు, ఉండి కార్యక్రమ ఊసే లేదు


పెనుమంట్ర, న్యూస్‌టుడే: పొలంబడి కార్యక్రమం గతంలో మాకెంతో ఉపయోగపడేది. ఆ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చేవారు. పైగా కొంత విషయాలను ఎన్నో వివరించేవారు. సాగులో వస్తున్న మార్పులు, అందుబాటులోకి వచ్చిన యంత్రాలు, పరికరాల గురించి చెప్పేవారు. మాకున్న సాగుపరమైన కష్టసుఖాలను చెప్పేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు ఈ కార్యక్రమ ఊసేలేదు. ఇక సాగుపరమైన విషయాలు ఎవరు  చెబుతారు.

సీహెచ్‌. అప్పారావు, రైతు, పెనుమంట్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని