logo

భీమవరంలో కాషాయ వేడుక

రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో భీమవరంలో కాషాయమయమైంది.

Published : 25 Jan 2023 05:26 IST

రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన భాజపా నాయకులు, ప్రతినిధులు

హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో భీమవరంలో కాషాయమయమైంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సమావేశాల్లో పలు తీర్మానాలు, తాజా, భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వైకాపా ప్రభుత్వం తమవిగా గొప్పలు చెప్పుకోవడంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వందేమాతరం నినాదంతో..

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రాంగణం వందేమాతరం నినాదంతో మార్మోగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్‌పవార్‌, మురళీధరన్‌, జాతీయ నాయకులు శివప్రకాశ్‌, సునీల్‌ దేవధర్‌, మధుకర్‌, ఎంపీలు సీఎం రమేష్‌, జీవీఎల్‌ నరసింహారావు తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించారు. అనంతరం సభా కార్యక్రమాలను కొనసాగించారు.


క్రమశిక్షణతో..

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 400కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 23న పలు నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌ స్థాయి శక్తి కేంద్రాలను పరిశీలించిన ఆవాస్‌ ప్రతినిధులు అదే ప్రాంతంలోని పార్టీ కార్యకర్తల ఇళ్లలో బస చేశారు. భీమవరం జువ్వలపాలెంరోడ్డులోని ఆనంద ఫంక్షన్‌ హాలుకు ఉదయం చేరుకున్నారు. ప్రతినిధులను సమావేశ మందిరంలోకి పంపే ముందు మహిళా మోర్చా నాయకులు, ప్రతినిధులు తిలకం దిద్ది ఆహ్వానించారు. పార్టీ కండువా వేసుకుని, తలపై భాజపా జెండా గుర్తుతో కూడిన టోపీ ధరించి  పాల్గొన్నారు. పార్టీ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ, భూపతిరాజు శ్రీనివాస వర్మ, నార్ని తాతాజీ, పేరిచర్ల సుభాష్‌, కాయిత సురేంద్ర, కోమటి రవికుమార్‌ తదితరులు పర్యవేక్షించారు.  


విప్లవ వీరునికి నివాళులు

కార్యవర్గ సమావేశానికి ముందు పార్టీ జాతీయ నాయకుడు శివ ప్రకాశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సందర్శించారు. ప్రాంగణ సుందరీకరణను పరిశీలించారు.


మావుళ్లమ్మ ఆలయంలో..

కార్యవర్గ సమావేశాలకు హాజరైన పలువురు నాయకులు, ప్రతినిధులు మావుళ్లమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహోత్సవాల  గురించి తెలుసుకున్నారు.


అభివృద్ధిని తెలియజేద్దాం

  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయి నుంచి వివరించేలా తమ వంతు భూమిక ఉంటుందని మహిళా మోర్చా నాయకులు అన్నారు.   భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాల గోడపత్రాన్ని కేంద్రమంత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని