logo

మార్టేరు పరిశోధన స్థానానికి మరో ఘనత

మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సమీకృత వ్యవసాయ విధానంలో మరో ఘనత సాధించింది.

Published : 25 Jan 2023 05:26 IST

సమీకృత వ్యవసాయ విధానంలో జాతీయ స్థాయి పురస్కారం

శ్రీనివాస్‌ను అభినందిస్తున్న ఏడీఆర్‌ భరతలక్ష్మి

మార్టేరు(పెనుమంట్ర), న్యూస్‌టుడే:  మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సమీకృత వ్యవసాయ విధానంలో మరో ఘనత సాధించింది. సమీకృత వ్యవసాయంలో విస్తృత పరిశోధన చేసి రైతులకు ఆచరణ యోగ్యమైన విధానాలను అందించి వారిని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ మేరకు ఉత్తమ పరిశోధన స్థానం అవార్డు వరించింది. ఇటీవల మహారాష్ట్ర రాహూరిలోని మహాత్మా ఫులే కృషి విశ్వవిద్యాలయంలో జరిగిన సమీకృత వ్యవసాయ విధాన క్షేత్రాల సదస్సులో సమీకృత వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మానుకొండ శ్రీనివాస్‌ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం పరిశోధన స్థానంలో ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.భరతలక్ష్మి విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ఏడేళ్లుగా శ్రీనివాస్‌ బృందం ఈ సమీకృత వ్యవసాయ విధానాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. రైతు రెండంకెల సుస్థిర ఆదాయం పొందేలా ఈ పరిశోధనలు సాగాయని తెలిపారు. మాగాణి, పల్లపు భూముల్లో అనువైన సమీకృత విధానాలపై నమూనా ఇచ్చి వాటిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఎంతో కృషి చేశారన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 38 పరిశోధనా స్థానాలు ఈ అవార్డుకు పోటీ పడగా తమ పరిశోధన స్థానానికి ఈ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. అవార్డు తీసుకున్న ప్రధాన శాస్త్రవేత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఐసీఏఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎస్‌కె.చౌదరి నుంచి జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం  గర్వంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో రైతులకు మేలు చేసే మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణాజీ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని