logo

పెళ్లి కళ వచ్చిందండోయ్‌!

భజంత్రీలు మోగే సమయం ఆసన్నమైంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు  ముహూర్తాలున్నాయి.

Published : 26 Jan 2023 04:52 IST

నేటి నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: భజంత్రీలు మోగే సమయం ఆసన్నమైంది. మాఘ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. ఈ నెల 26 నుంచి మార్చి 17 వరకు  ముహూర్తాలున్నాయి. వివాహాలతో పాటు గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు ఎవరికివారు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతీయువకులు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. పెళ్లి కాగానే విదేశాలకు వెళ్లాల్సిన కొత్త దంపతులు ముందుగానే ఇందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నెలన్నర పాటు ఎటు చూసినా పందిళ్లు...సందళ్లు..కల్యాణ మండపాలు మొదలు వాటిపై ఆధారపడి ఉన్న పలు రంగాలకు డిమాండ్‌ ఏర్పడింది.  

అనుబంధ రంగాలకు ఉపాధి.. పెళ్లంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి. పురోహితులు, వంటల తయారీదారులు, షామియానాలు సమకూర్చేవారు, ఫొటోగ్రాఫర్లు, లైటింగ్‌, పూల అలంకరణ చేసేవారు, మంగళ వాయిద్యాలు, దర్జీలు, ఆభరణ తయారీ దారులు, ఐస్‌క్రీం, బ్యూటీ పార్లర్లు, కూరగాయల సరఫరాదారులకు ఇప్పటికే గిరాకీ పెరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో 350 వరకు కల్యాణ మండపాలు ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు నిర్వాహకులు ఒక్కసారిగా అద్దె ధరలు పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


తేదీలు ఇవే..

గతేడాది డిసెంబరు 2 నుంచి 18వ తేదీ వరకు పరిమిత ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు తక్కువగానే జరిగాయి. ఈ నెల 26, 27, 28, ఫిబ్రవరి 1, 8, 9, 10, 11, 12, 15, 16, 23, 24, మార్చి 1, 5, 8, 9, 10, 11, 13, 15, 17 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని