logo

పురోభివృద్ధికి పునరంకితం

త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకుని జిల్లా ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుదాం’ అని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 03:47 IST

వ్యవసాయంతో పాటు అన్ని రంగాల ప్రగతిపై దృష్టి
గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

పోలీసుల కవాతును వీక్షిస్తూ గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌

ప్రసన్న వెంకటేశ్‌, జేసీ అరుణ్‌బాబు, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకుని జిల్లా ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలి.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుదాం’ అని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఏలూరు పోలీస్‌ కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దిన వేడుకలు నిర్వహించారు. ఆయన ముందుగా జాతీయజెండాను ఆవిష్కరించి..పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వ్యవసాయం, దిశ, పోలీసు, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాలు, జలవనరులు, విద్యా, వైద్యఆరోగ్య తదితర శాఖలు దాదాపు 15 శకటాలను ప్రదర్శించాయి. విద్య ప్రాధాన్యత తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ, వ్యవసాయశాఖకు ద్వితీయ బహుమతులు దక్కాయి. పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 234 మంది ఉద్యోగులకు, సిబ్బందితోపాటు వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలకు కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజేతలకు కలెక్టర్‌ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. మైదానంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు సందర్శించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్‌, శాసనమండలి సభ్యుడు షేక్‌ సాబ్జీ, ఐజీ పాలరాజు, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, జేసీ అరుణ్‌బాబు, డీఆర్‌వో మూర్తి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రూ.600 కోట్లతో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు

జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ ప్రసంగించారు. ‘వ్యవసాయ రంగంతోపాటు అన్ని రంగాల పురోగతిపై దృష్టి కేంద్రీకరించాం. జిల్లాలో 540 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతున్నాం. ఖరీఫ్‌లో 3.51లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.625కోట్లు రైతులకు జమ చేశాం. ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ అందిస్తున్నాం. మాతాశిశు మరణాల నియంత్రణకు పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో 24 గంటలు సేవలు అందిస్తున్నాం. నాడు-నేడులో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తున్నాం. రూ.600 కోట్లతో జల్‌జీవన్‌ మిషన్‌ పనులు చేపట్టాం. రూ.205 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 164 గ్రామాలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 685 గ్రామీణ రహదారుల పనులు చేపడుతున్నాం. రూ.18 కోట్లతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నాం. రైతుభరోసా, సచివాలయాలు, ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఆర్థిక ఏడాదిలో సింగిల్‌ విండో విధానంలో 188 పరిశ్రమలకు అనుమతులిచ్చాం’ అని పేర్కొన్నారు.

జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం ముందు పంట ఉత్పత్తులతో  రైతులు

ఏలూరు సెయింట్‌ థెరిసా బాలికోన్నత పాఠశాల విద్యార్థుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని